చంద్రబాబు పశుపతి అనే అర్థంలో పసుపుపతి అంటూ వ్యాఖ్యానించి ఆయనకు ఓటు వేయవద్దు అంటూ జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కోనసీమలో ప్రజాగళం సభలలో తాను పశుపతిని అన్న జగన్ తాను అంగీకరిస్తున్నా అన్నారు. పశుపతి అంటే శివుడని.. ప్రపంచాన్ని కాపాడిన దేవుడని అన్నారు. తనపై.. తన కుటుంబంపై దాడి చేశారని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాను కూడా పశుపతి మాదిరిగానే రాష్ట్రాన్ని రక్షించుకుంటానన్నారు.
“నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా… ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా మీరు చూస్తున్నారు… నన్ను అనేక మాటలు అన్నారు, మిత్రుడు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన… మళ్లీ తెలుగుజాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడ్ని అవుతున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు.
పశుపతి అనే పేరు ఓ సినిమాలో విలన్‌కు పెట్టారని మిడి మిడి జ్ఞానంతో రచయితలు రాసిచ్చే స్క్రిప్టులను జగన్ మోహన్ రెడ్డి ప్రాసలు కలిసి వస్తున్నాయి కదా అని చదివేస్తున్నారు. ఆయనకు వాటికి అర్థం కూడా తెలియదు. పదాలను కూడా తప్పుగా చదువుతూంటారు. ఇలాంటి స్క్రిప్టులు రాసి.. మరింతగా ఆయనను రైటర్లు నవ్వుల పాలు చేస్తున్నారు.