తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చారు. రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న విజ్ఞప్తి చేసి .. అక్కడ మీడియాతో మాట్లాడటం మినహా ఇంకెవర్నీ కలవలేకపోయారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభిస్తాయని టీడీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసినా ఆ మేరకు వారి నుంచి స్పష్టత రాలేదు. అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వ్యవహారాలపై తీరిక లేకుండా ఉన్నారు.
ఇక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా లభించే అవకాశం కనిపించలేదు. దీంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం టీడీపీ బృందంతో తిరిరిగి వచ్చేశారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీలో పరిస్థితులను వివరించాలనుకున్నారు. అవినీతి గురించి చెప్పాలనుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఒక్క రాష్ట్రపతిని మాత్రం కలిసి .. ఫిర్యాదు చేయగలిగారు. అయితే ఈ ఫిర్యాదు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని టీడీపీ వర్గాలకూ తెలుసు.
మరో వైపు రాష్ట్రపతిని కలిసే వరకూ పోలీసులు టీడీపీ ఆఫీసు, పట్టాభి ఇళ్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశామని ప్రకటనలు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు మాట మార్చారు. ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. వారికి నోటీసులు మాత్రమే జారీ చేశామంటున్నారు. దీంతో టీడీపీ నేతల ఢిల్లీ పర్యటన కనీసం తమ ఆపీసులు, ఇళ్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయించలేకపోయిందన్న సెటైర్లు పడుతున్నాయి.