రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత చెప్పినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్నాడని… ఆయనకు.. సీఎస్‌కు తేడా ఏముందని… చంద్రబాబు నేరుగా ప్రశ్నించారు. దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పారు. టీటీడీకి చెందిన బంగారాన్ని… రవాణా చేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాహనాల్ని తమిళనాడులో ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఇది పూర్తిగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం. అయితే.. వైసీపీ నేతలు ఇందులోనూ రాజకీయం చేశారు. శ్రీవారి బంగారం పట్ల.. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు చేశారు. వెంటనే… సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ముఖ్యమంత్రిని కూడా సంప్రదించకుండా.. విచారణ కమిటీ వేశారు. అలాగే.. మూడు రోజుల కిందట.. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై సీఎస్ సమీక్ష చేసి మూసివేస్తామనే వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా అవే వ్యాఖ్యలను.. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో… అన్నీ… ప్రతిపక్ష నేత ఆదేశాల మేరకే సీఎస్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు.
పైగా… ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు అపధర్మ ముఖ్యమంత్రి కాదని, ఆయన రెగ్యులర్ ముఖ్యమంత్రేనని చెబుతూ ఆయనకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో అధికారాలు లేవని సీఎస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పరిశీలించిన చంద్రబాబు.. వీటిపై వివరణ కోరుతూ సీఎస్ కు లేఖ రాశారు. అంత కుముందే ముఖ్యమంత్రి సచివాలయంలోకి వెళ్లిన సమయంలో కూడా ఆయన్ను కలిసేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం రాకపోవడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి సమీక్షలకు వెళ్లకూడదని ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యమంత్రి వివరణ కోరితే… సీఎస్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చారు కూడా. అయితే.. తాను అలా అనలేదని… ఏకవాక్యంతో వివరణ పంపినట్లు చెబుతున్నారు. దీనిపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
బుధవారం జరిగిన ప్రెస్మీట్లో చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీఎస్ వివరణ తన దగ్గర ఉందని.. ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. పరిపాలన గురించి తనకు ఎవరు చెప్పాల్సిన అవసరంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడంతోపాటు తాను అధికారులను విభజించి, పాలించదలచుకోలేదని, ఇదే అధికారులతో ఈ నెల 23వ తేదీ తర్వాత కూడా తాను పనిచేయించుకోవాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు .. సీఎస్ వ్యవహారశైలిని.. తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం ఉండగా.. ప్రతిపక్ష నేత ఆదేశాలను అమలు చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. దీనిపై ఏం చేయాలో కూడా ఇప్పటికే క్లారిటీ తెచ్చుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.