దేశ రాజకీయాల్లో వ్యక్తిగతంగాఎవరికీ ప్రాధాన్యత ఉండటం.. ఉండకపోవడం ఉండదు. రాజకీయ బలం మాత్రమే కీలకం. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు అద్వానీ. బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు అద్వానీ. ఆయనకు ఇప్పుడు బీజేపీలో ఎలాంటి పలుకుబడి లేదు. రాజకీయాల్లో ఎవరికైనా ఉన్న వ్యక్తిగత పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు ప్రాధాన్యతను నిర్ణయించవు. ఎవరికైనా రాజకీయ ప్రాబల్యమే ప్రాధాన్యతను నిర్ణయిస్తుంది.
అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు..!
వాజ్‌పేయి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. అప్పుడు చంద్రబాబునాయుడు మద్దతు కీలకం అయింది. ఆ పరిస్థితుల్లో చక్రం తిప్పడానికి అవకాశం దొరికింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నరేంద్రమోడీ ప్రభుత్వానికి సొంతంగా మెజార్టీ ఉంది. 2019 ఎన్నికల్లో ఏదైనా పార్టీకి లేదా కూటమి పూర్తి మెజార్టీ వస్తే.. చంద్రబాబుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చినా ఏమీ చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ పట్టించుకోని వారు.. రేపు పట్టించుకోవడానికి అవకాశమే లేదు. జాతీయ రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులు… చక్రం తిప్పే అవకాశాలను తగ్గించేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు తగ్గాయి..!
ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లు ఉన్నాయి. బెంగాల్‌కు కూడా 42 స్థానాలున్నాయి. ఈ రెండింటికన్నా.. యూపీ, బీహార్‌లో మాత్రమే అత్యధిక లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పుడు ఏపీలో ఇరవై ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి. యూపీ, బీహార్, కర్ణాటక ,తమిళనాడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు దక్కని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు దక్కుతుందని నేను అనుకోను. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఇప్పుడున్నన్ని ప్రాంతీయ పార్టీలు లేవు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఆ రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్లు ఉండేది. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు ఉంది. అంటే రెండు ప్రాంతీయ పార్టీల పోరాటంగా మారింది. దీని వల్ల ఏపీ ప్రాంతీయ పార్టీ.. జాతీయ స్థాయిలో నిర్వహించే పాత్ర కూడా మారుతుంది.
ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలో పోటీ పడుతున్నాయి..!
కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉంటే జాతీయ అంశాలను చూపెట్టి..కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేయవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకవర్గానికి ప్రతీక. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా కూడా చేశారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్..బీజేపీ వ్యతిరేకత అన్నది లేదు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరాటం. అప్పుడు ఒకటే ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్‌తో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌తో కలిసే చాన్స్ లేదు. కానీ ఏపీలో ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీతో.. టీడీపీ కాకపోతే.. వైసీపీ కలుస్తుంది. చంద్రబాబుని నరేంద్రమోడీ ఇంత లైట్‌గా తీసుకోవడానికి కారణం అదే.
చంద్రబాబు నిర్ణయాల్లో నిలకడ లేదు..!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకే.. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలమధ్యే పోరాటం ఉన్నప్పుడు.. ఢిల్లీలో ఉన్న పార్టీలు.. సీరియస్‌గా తీసుకోవు. ఎందుకంటే.. ఒకరు కాకపోతే.. ఇంకొకరు కలుస్తారనే అంచనాలే దానికి కారణం. ఇంకో ముఖ్యమైన అంశం ఏమింటంటే.. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ తీసుకున్న వైఖరి కూడా… ఆ పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే.. టీడీపీ ఇప్పటి వరకూ.. ఒకే విధానం మీద లేదు. రకరాకల ఫ్రంట్‌ల్లో చేరారు. బీజేపీతో కలిశారు. మళ్లీ విడిపోయారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి అంటున్నారు. కచ్చితంగా బీజేపీ కూటమిలో ఉంటారని ఢిల్లీలోని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు నమ్మలేకపోతున్నాయి. సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు. తెలుగుదేశం ఒక్కటే కాదు.. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే ఉన్నాయి.
చక్రం తిప్పే పరిస్థితులు ఉంటేనే ..!
దేశ రాజకీయాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాయి. బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వైపు వెళ్లవు. కానీ చంద్రబాబుకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందువల్ల అప్పుడున్న పరిస్థితిలు ఇప్పుడు లేవని చెప్పుకొవచ్చు. ఇవన్నీ ఇరవై సీట్లు వస్తేనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో… గుంపగుత్తగా టీడీపీ ఇరవై ఐదు సీట్లు రాకపోవచ్చు. అలాగే.. ఢిల్లీలో చక్రం తిప్పే చాన్స్ కూడా రాకపోవచ్చు. చక్రం తిప్పాలంటే గొప్పగా రాజకీయాలు చేయడం.. తన దగ్గర సీట్లు ఉండటం కాదు.. చక్రం తిప్పగలిగేలా రాజకీయ పరిస్థితులు ఉండాలి.