హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెబాస్టియన్కు ఫోన్ చేశారనటం, ఆయన అరెస్టు ఇవాళే అని, రేపే అని మీడియాలో జోరుగా వార్తలు రావటం తెలిసిందే. నమస్తే తెలంగాణ దినపత్రిక అయితే ఒక అడుగు ముందుకేసి బాబు ఊచలు లెక్కపెట్టబోతున్నాడంటూ పలు కథనాలు ఇచ్చింది. టీఆర్ఎస్, వైసీపీ పార్టీల నాయకులుకూడా బాబు అడ్డంగా ఇరుక్కుపోయారని, తప్పించుకోలేరని జోస్యం చెప్పారు. మరికాస్సేపట్లో బాబుకు ఏసీబీ నోటీసు ఇవ్వబోతోందంటూ టీవీ ఛానల్స్ అన్నీ పొలోమని స్క్రోలింగులిచ్చాయి. ఇవాళ్టి పరిణామంతో అవన్నీ వీగిపోయినట్లయ్యాయి. ఈ సంచలన కేసులో ఏసీబీ ఇవాళ కోర్టుకు సమర్పించిన ప్రిలిమనరీ ఛార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య పేర్లనే నమోదు చేశారు. ఇప్పటివరకు 39మంది సాక్షులను విచారించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
కేంద్రంలో కీలకస్థానంలో ఉన్న ఒకమంత్రి చేసిన మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలమధ్య రాజీ కుదిరిందని వచ్చిన వార్తలు నిజమేనని తాజా పరిణామంతో రుజువయింది. చివరికి దీనిగురించి కొట్టుకున్న టీఆర్ఎస్, టీడీపీ పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు, మీడియాసంస్థలు, ప్రజలు పిచ్చోళ్ళయినట్లయింది. వాస్తవానికి, ఈ కేసులో చంద్రబాబు అంతు తేలుస్తానని, బ్రహ్మదేవుడుకూడా కాపడలేడంటూ మొదట హుంకరించిన కేసీఆర్, ఇటీవల చంద్రబాబుగురించి వివిధ కార్యక్రమాలలో ప్రస్తావించినప్పటికీ ఓటుకు నోటు కేసులో బాబు పాత్రగురించి ప్రస్తావించకపోవటం గమనార్హం.