ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో ముఖ్యం అన్న సుత్రాన్ని చంద్రబాబు పక్కాగా పాటిస్తున్నట్లు కనపడుతోంది. కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాక పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే లోపే కూటమిగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్న వారి ప్లాన్ పక్కాగా అమలవుతోంది.
అయితే, చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న పుకార్లకు బాబు స్ట్రాటజిక్ గానే చెక్ పెడుతున్నారు. బాబు వస్తే వాలంటీర్ల జాబులు పోతాయ్, బాబు వస్తే వైసీపీ చేపడుతున్న సంక్షేమ పథకాలు అందవు అంటూ ప్రచారం చేస్తుండగా… చంద్రబాబు ప్రచారంలో వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతున్నారు.
తాజాగా అమలాపురం, పి. గన్నవరంలో జరిగిన సమావేశాల్లోనూ యువత విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు అంటూ పవన్ కు క్రెడిట్ ఇవ్వటం, వైసీపీ తెచ్చిన సంక్షేమ పథకాల్లో కీలకమైన చేనేత, అమ్మవడి, విద్యాదీవెన వంటి పథకాలను నిలిపివేయనని చెప్తూనే ఎలాంటి కోత లేకుండా ఇంకా ఎక్కువ మొత్తం ఇస్తానని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి పథకం ఇస్తానని లెక్కలతో సహా చెప్తూ వాలంటీర్లకు 10వేల జీతం అది కూడా ప్రతి నెల ఒకటో తేదీన అని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
నిజానికి కూటమి వస్తే చంద్రబాబు సీఎంగా ఉంటే… జగన్ పథకాలు ఆగిపోతాయన్న ప్రచారం గ్రౌండ్ లో ఉంది. ముఖ్యంగా పెన్షన్ల విషయంలోనూ వైసీపీ ఎన్నో అపోహలు సృష్టించి పెట్టింది. ఇప్పుడు ప్రచారంలో వాటన్నింటికి చెక్ పెడుతూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు అన్నీ తానే చేశానని చెప్పుకునే అలవాటు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా ఆయనలోనూ మార్పు వచ్చిందని సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు. ఇదే స్ట్రాటజీ చివరి వరకు కొనసాగితే కూటమి సర్కార్ ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.