సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమలైనా టైం ఫిక్స్ చేసుకొని పని చేసుకుంటూ పోవడమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్క్ స్టైల్. ఇందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఫించన్లను జులై ఒకటో తేదీనే అర్హులైన వారికి పెంచిన పెన్షన్ పంపిణీ చేయాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చేసిన కసరత్తు కూడా తుది దశకు చేరుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నిర్ణయం సాహసోపేతమైనదని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఫించన్ పంపిణీ విషయంలో ఆలస్యం చేయబోమని సకాలంలో అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచిన పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద భారమే. కాకపోతే, పెన్షన్ల పంపిణీలో రాజకీయం చేయవద్దని చంద్రబాబు మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు.
జగన్ చేసిన నిర్వాకంతో ఏపీ ఆర్థికంగా దివాలా తీస్తోంది. వీటిని పూడ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాల్సి ఉంది. అయినా కూడా చంద్రబాబు సామాజిక పెన్షన్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గోద్దని భావించారు. పెంచిన పెన్షన్ కోసం కేంద్ర సాయం తీసుకొని శనివారం నుంచి అన్ని బ్యాంకుల్లోనూ పింఛనుకు సంబంధించిన నిధులను రెడీ చేయనున్నారు.
తద్వారా..చంద్రబాబు పీరియడ్ లో మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు, వృద్దులకు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తారని వాదనను మరోసారి నిజం చేసి చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిక్స్ గ్యారంటీస్ అమలులో పరిస్థితులను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ కు ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలిచిన పెన్షన్ దారులను కూటమి వైపు మళ్ళించేలా పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.