తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కర్ణాటక ఎన్నికల ప్రచారం… బీజేపీకి 150 నుంచి 170 లోపు సీట్లు వస్తాయని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం లేదని.. దానికి ఈ సీట్ల సంఖ్య నిదర్శనమని చెబుతూ వస్తున్నారు. అయితే.. ప్రస్తుతం దేశంలో రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనాల కన్నా… ఇది చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం… ఇతర నేతల్లో ఏర్పడుతోంది.
బీజేపీకి 170 సీట్లు వస్తే మిత్రపక్షాలకు వంద సీట్లు రావా..?
భారతీయ జనతా పార్టీకి 170 వరకూ స్థానాలు వస్తాయని… టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారంటే… ఆ పార్టీ గెలుస్తుందనే అర్థం. బీజేపీకి సహజంగానే ఈ సారి వంద సీట్లు తగ్గుతాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ.. 282 లోక్సభ సీట్లలో విజయం సాధించింది. ఈ సారి వందకుపైగా తగ్గుతాయని.. చంద్రబాబు చెప్పదల్చుకున్నారు. కానీ అర్థం మాత్రం వేరేగా వస్తోంది. బీజేపీనే సొంతంగా 170 సీట్లను సంపాదించుకున్నప్పుడు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 102 సీట్లు మాత్రమే అవసరం అవుతాయి. బీజేపీకి ఎలాగూ మిత్రపక్షాలు ఉండనే ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన ఉంది. ఆ పార్టీకి కొన్ని సీట్లు వస్తాయి. బీహార్లో జేడీయూ ఉంది. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒడిషాలో… బిజూపట్నాయక్ కలిస్తే .., బీజేపీకి ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్, వైసీపీలు బీజేపీతో కలిసి ఉంటున్నారని చంద్రబాబే చెబుతూ వస్తున్నారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలోనూ వారు మద్దతివ్వలేదు. ఇవి కాక.. యూపీలో, ఈశాన్యంలో మరికొన్ని మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వారికి మద్దతిచ్చే పార్టీలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే.. బీజేపీ అధికారానికి దగ్గరగా ఉన్నట్లే భావించాలి.
కాంగ్రెస్ , మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు వస్తాయి..?
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే… చంద్రబాబు చెప్పింది కరెక్టే. ఆ పార్టీకి 170 వరకూ సీట్లు వస్తాయి. నా అంచనా కూడా అదే. అయితే.. సెఫాలజిస్ట్గా చెప్పడం వేరు.. రాజకీయ పార్టీ నేతగా చెప్పడం వేరు. ఓ పార్టీకి 170 సీట్లు వస్తాయంటే.. గెలుపు దగ్గరగా ఉన్నట్లే. అయితే చంద్రబాబు.. ఎన్డీఏకి 170 వస్తాయన్న అర్థంలో చెప్పి ఉంటారా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన ఉద్దేశం బీజేపీ అంటే.. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి అయితే.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేం. చంద్రబాబు చెప్పాల్సింది.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదు.. కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతో కలిపి ఇప్పుడు కూటమిగా కొన్ని పార్టీలు ఉన్నాయి.. అలాగే… ఎన్నికలయిన తర్వాత మద్దతిస్తామని.. మరికొన్ని పార్టీలు ప్రకటించాయి. ఈ పార్టీలన్నింటికీ కలిసి.. మ్యాజిక్ మార్క్ అందుకుంటుందా లేదా అన్నది చెప్పాలి. భారత రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అధికారానికి ఎవరు దగ్గరగా ఉంటారో.. వారి దగ్గరకు అనేక పార్టీలు వెళ్తాయి. చరిత్ర చెబుతున్నది ఇదే.
అధికార పార్టీకి దగ్గరగా ఉంటాయి ప్రాంతీయ పార్టీలు..! అలాగే జరుగుతుందా..?
భారత రాజకీయాల్లో పార్టీలు… నిర్ణయాలు చాలా వేగంగా మార్చుకుంటాయి. గోధ్రా ఘటనతో… తమ తమ రాష్ట్రాలకు మోడీ రావడానికే అంగీకరించని పార్టీలు… ఆయనే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాయి. పొత్తులు పెట్టుకుని పోటీ చేశాయి. బీజేడీ, టీడీపీ, మమతా బెనర్జీ ఇలా… అనేక పార్టీలు.. ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసిన వారే్. ఇప్పుడు ఆ పార్టీతోనే హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పుడు.. బీజేపీపై విడిగా పోటీ చేస్తున్న పార్టీలపై కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఎస్పీ, బీఎస్పీలు .. బీజేపీపై పోరాడుతున్నప్పటికీ.. ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు… బీజేపీ వైపు వెళ్లవచ్చంటున్నారు. ములాయంసింగ్.. మళ్లీ మోడీ ప్రధాని అవుతారంటూ.. నేరుగా పార్లమెంట్లోనే ప్రకటించారు. దీనంతటిని బట్టి చూస్తే.. 170 సీట్లు బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక వేళ.. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారం చేపట్టడానికి ఇష్టపడకపోతే… స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. అది కాంగ్రెస్దా… మిత్రపక్షాలదా అన్నది చెప్పలేము. మొత్తానికి దేశంలో ఇప్పుడు.. బీజేపీకి సీట్లు తగ్గుతాయి… కానీ మోడీనే మళ్లీ ప్రధాని అవుతారన్న ఓ అంచనా ఉంది. ఇది ఊహాగానమే కానీ.. అలాంటి దాన్నే.. చంద్రబాబు వ్యక్తం చేశారు. అయితే.. రాజకీయ నాయకుడిగా.. చంద్రబాబు ఇలా చెప్పడం.. బీజేపీని సంతోషపరిచేదే..!