“చలో ఆత్మకూరు “… తెలుగుదేశం పార్టీకి ఆక్సీజన్ ఇచ్చింది. చంద్రబాబుతో సహా.. ఏ ఒక్క నేత ఇంట్లో నుంచి కదల్లేదు. పోలీసులు కదలనీయ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం కదిలిదింది. హుటాహుటిన బాధితులందరితో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పి… సొంత గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెట్టి వచ్చారు. ఈ విషయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నానికి .. ఓటమి వేదనలో ఉన్న టీడీపీ నేతలంతా… ఐక్యంగా మద్దతు పలికారు. అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం… బెదింపులు..భయాలు.. కేసులు…భవిష్యత్ రాజకీయాలు.. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకుని… ఇక టీడీపీకి దూరమవుతారని.. ప్రచారం జరుగుతున్న వారంతా.. యాక్టివ్ గా… ఈ కార్యక్రమంలో పాల్గొనడం.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం.. టీడీపీ క్యాడర్ కు సైతం ధైర్యం కల్పించినట్లయింది.
పార్టీ మార్పు ప్రచారం ఉన్న వారే ముందున్నారు..!
బాధితుల్ని తీసుకుని చంద్రబాబు..ర్యాలీగా ఆత్మకూర్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించినట్లయితే… ఇంత హడావుడి జరిగి ఉండేది కాదు. కానీ వైసీపీ నేతలు .. మొదటి నుంచి.. బాధితుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా చెబుతూ.. వస్తోంది. పోటీగా.. పల్నాడులో.. టీడీపీ బాధితుల శిబిరం పెట్టింది. దాంతో… అది రాజకీయంగా మారిపోయింది. అప్పుడే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వ పెద్దల ఆలోచనా విధానాన్ని.. పక్కాగా పట్టుకున్న టీడీపీ నేతలు… ఆ టెంపోను.. అంతకంతకూ పెంచుకుంటూ పోయారు కానీ..తగ్గించలేదు. పార్టీ మారుతారని ప్రచారంలో ఉన్న నేతలే.. ఎక్కువ యాక్టివ్ గా… వైసీపీపై పోరాటానికి రంగంలోకి వచ్చారు. భూమా అఖిలప్రియ లాంటి నేతలు…చాలా ఘాటుగానే.. వైసీపీపై విరుచుకుపడ్డారు. ఆమె రాక్షసులనే మాటను.. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు.. ఇంటి పేరుగా తగిలించేసి మాట్లాడుతున్నారు. కేశినేని నాని, దేవినేని అవినాష్ లాంటి వారిపై పార్టీ మార్పు ప్రచారం వచ్చినా… చలో ఆత్మకూర్ విషయంలో తమ ఇమేజ్ కు తగ్గ రోల్స్ పోషించారు.
తెగింపునిచ్చిన పోలీసుల అత్యుత్సాహం..!
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, భూమా అఖిల ప్రియ, జవహర్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్ బాబుల ఇలా ప్రతి ఒక్కర్నీ నిర్బంధించారు. ఈ నిర్బంధాలే.. ఓ రకంగా.. టీడీపీ నేతలకు ధైర్యం ఇచ్చినట్లయింది. తాము ఎంత బలంగా ఉన్నమో…పోలీసులు తీసుకున్న జాగ్రత్తలే నిరూపించాయని.. వారు నిర్ణయానికి వచ్చారు. అందుకే… చలో ఆత్మకూరు విషయంలో అంటీముట్టనట్లు ఉండాలనుకున్న కొంత మంది నేతలు కూడా.. ఉదయం పరిస్థితి చూసి… ఒక్క సారిగా ఎగ్రెసివ్ గా మారిపోయారు.
భయపడే నేతలకు సైతం ధైర్యం వచ్చినట్లే..!
ఇప్పటి వరకూ…తెలుగుదేశం పార్టీ నేతల్లో ఓ భయం ఉంది. వైసీపీ ప్రభుత్వానికి ఎదురెళితే.. కేసుల్లో ఇబ్బంది పెడతారని.. గత ఐదేళ్లుగా అధికారపక్షంలో ఉన్నందున.. ఏదో ఓ లొసుగు బయట పెట్టి ఇబ్బంది పెడతారన్న భయంతో.. వీలైనంత మౌనం పాటిస్తున్నారు. కానీ.. చలో ఆత్మకూరు కార్యక్రమంతో… ఆ భయాలన్నీ టీడీపీ నేతలకు పటాపంచలు అయ్యాయి. తాము రోడ్ల మీదకు రాలేదని.. వస్తామని చెబితేనే.. ప్రభుత్వం ఇంతగా వణికిపోయిందని… అలాంటప్పుడు.. ఇక ఈ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం ఏముందన్న చర్చ ప్రారంభమయింది. టీడీపీ క్యాడర్ లో భరోసా కోసం చంద్రబాబు చేపట్టిన చలో ఆత్మకూర్.. నేతల్లోనూ… ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇది టీడీపీ అధినేతకు..కొత్త ఉత్సాహం కలిగించేదే..! పునరావాస శిబిరం నుంచి పల్నాడు వైసీపీ బాదితులను ఆయా గ్రామాలకు తరలించటంతో ఉద్రిక్తత కొంత వరకు సడలింది. ఆయా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన తెలుగుదేశం పార్టీ నేతలందర్నీ కూడా సాయంత్రానికి ఒక్కొక్కర్నీ విడుదల చేయడం ప్రారంభించారు.