హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న, మొన్న విజయవాడలో మాట్లాడిన లైవ్ టెలికాస్ట్ చూసినవారికి ఈ సందేహం కలగక మానదు. కనీసం రెండు గంటలు తక్కువ కాకుండా మాట్లాడుతున్నారు. ఆ రెండు గంటల వ్యవధిలో అసలు విషయం ఐదు నిమిషాలు కూడా ఉండటం లేదు. మిగిలినదంతా ఊకదంపుడే. వినేవాళ్ళకు విసుగొస్తోందిగానీ, బాబుకు విసుగు రావటంలేదు. ఇది ఈ రెండు రోజులగానే కాదు. కొంతకాలంగా ఇదే సాగుతోంది. ఉపన్యాసాలలో చెప్పిన విషయాన్నే చెప్పటం, గతంలో తాను చేసిన విజయాలను ఉటంకించటమే ఎక్కువగా ఉంటోంది. ఆదివారం నాటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో తానేం చేయాలో మీరే చెప్పాలంటూ అక్కడున్న మీడియా ప్రతినిధులను ఒకటికి నాలుగు సార్లు గుచ్చి గుచ్చి అడిగారు. ఉన్నట్లుండి ముఖ్యమంత్రి ఇలా అడిగేసరికి ఆ పరిణామాన్ని ఊహించని విలేకరులు అవాక్కయ్యారు. ప్రెస్ మీట్లలోనే కాదు, వీడియో కాన్ఫరెన్స్లలోనూ, ఐఏఎస్ అధికారులతో సమావేశాలలోనూ ముఖ్యమంత్రి ఇలాగే గంటల తరబడి మాట్లాడుతున్నారని, తమ టైమంతా తినేస్తున్నారని అధికారులు బయటకొచ్చి తిట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే, బాబు గతంలోలా సమర్థవంతంగా, చురుకుగా వ్యవహరించటంలేదని, ఫోకస్ తగ్గిపోయిందని వాదనలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బాబు వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. వయసు మీద పడటం వలన సమర్థత తగ్గటం సహజ పరిణామమే. ఏది ఏమైనా ఉపన్యాసాలను క్లుప్తంగా ముగించమని ఆంతరింగుకులు ఎవరైనా బాబుకు చెబితే బాగుండు.