తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలోకి కొంతమంది నేతలు జంప్ చేసిన సంగతి తెలిసిందే! టిక్కెట్ పొందాక కూడా కొంతమంది చివరి నిమిషంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చిన పరిస్థితీ చూస్తున్నాం. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నేతల వలసలు అంటే… ఏ పార్టీకైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. అంతవరకూ ఖరారు చేసుకున్న ఎన్నికల వ్యూహాలు, పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా నడిపించేందుకు వేసుకున్న ప్రణాళికలూ ఇలా అన్నీ కొంత అస్తవ్యస్తం అవుతాయన్నది వాస్తవం. పార్టీకి ఝలక్ ఇచ్చిన నేతల వల్ల గెలుపు ఓటములపై పడే ప్రభావాన్ని తగ్గించే ఓ ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గడచిన రెండ్రోజులుగా ఆయన నిర్వహిస్తున్న ప్రచార సభల్లో ప్రసంగాలను గమనిస్తే అదేంటో అర్థమౌతుంది.
సోమవారం గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ… గుంటూరు 2లో ఒక నాయకుడు ఉండేవారనీ, ఐదేళ్లపాటు పని చేసుకుని చల్లగా జారుకున్నారన్నారు. దానివల్ల ఏమైందీ, ఏమన్నా అవుతుందా, ఏమీ కాదన్నారు చంద్రబాబు. వీళ్లంతా రేపట్నుంచీ తేలిపోతారన్నారు. పత్తిపాడులో ఒకాయనకి అప్పుడు సీటిచ్చాననీ, ఆయనా పోయారన్నారు. దాని వల్ల మంచే జరిగిందన్నారు! తాను వ్యక్తుల గురించి మాట్లాడననీ, చాలామంది నాయకులను పార్టీ తయారు చేసిందన్నారు. చాలామంది నాయకులు మన తమ్ముళ్ల భుజాల మీద ఎక్కి ఊరేగారనీ, మళ్లీ తమ్ముళ్లను తన్ని వెళ్లిపోతున్నారన్నారు. అయినా బాధలేదనీ, పార్టీ ముఖ్యమని తమ్ముళ్లు ఆలోచిస్తున్నారనీ, ఎన్ని మోసాలు చేసినా తిరుగులేని శక్తిగా పార్టీ ఉందంటే అది తమ్ముళ్ల త్యాగాల ఫలితమన్నారు.
కార్యకర్తల స్థాయిని పెంచి, పార్టీ వదిలిన నేతల వల్ల ఎలాంటి ప్రభావమూ ఉండదనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అయితే, పార్టీకి దూరమయ్యే నాయకులతోపాటు… కొంత కేడర్ కూడా కచ్చితంగా వెళ్తుంది. ఇప్పటికిప్పుడు ఉన్నవారిలో భరోసా నింపడానికి ఈ వ్యాఖ్యల వ్యూహం ఉపయోగపడొచ్చేమోగానీ… వెళ్లిపోయిన నాయకుడితో పనిలేకుండా… కేడర్ ని మాత్రమే వెనక్కి తిప్పుకోవడం కచ్చితంగా సవాలే. కొన్ని నెలల ముందు వలస వెళ్లిన నేతల ప్రభావం కంటే, ఇప్పుడు వెళ్లిపోయినవారి ప్రభావం పార్టీ మీద కచ్చితంగా ఉంటుంది. మరి, దీన్ని వ్యూహాత్మకంగా ఎలా ప్లస్ గా మార్చుకుంటారనేది వేచి చూడాలి.