హైదరాబాద్: భూములరేట్లు ఎక్కువగా ఉండటంవలనే విజయవాడ నగరం విశాఖపట్నం అంతగా అభివృద్ధి చెందలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఇవాళ విజయవాడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ దంతవైద్యశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో కాస్మోపాలిటన్ కల్చర్ రావాలని అన్నారు. మనుషుల్లో మార్పు రావాలని, చిల్లర విషయాలను పట్టించుకోకూడదని చెప్పారు. అద్దెలు బాగా పెంచేశారని, హైదరాబాద్, ముంబాయికంటే విజయవాడలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది మంచిది కాదని అన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రజలుకూడా సహకరించాలని కోరారు. అత్యాశతో భూములు ధరలు, అద్దెలు విపరీతంగా పెంచేయటంవలన విజయవాడకు, అమరావతికి ఎవరూ రారని చెప్పారు. అవసరమైతే కొద్దిగా తగ్గించి ఇవ్వాలని ప్రజలను కోరారు. అందరూ ముందుకు వచ్చి ఆదాయపు పన్ను చెల్లించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌కు పొడవైన తీరప్రాంతం ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ నష్టాలుకూడా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. తుపానులు ఎదుర్కోవలసి వస్తుందని, గత ఏడాది హుద్ హుద్ తుపాను సంభవించగా, ఈ ఏడాది భారీవర్షాలు దెబ్బతీశాయని అన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే కేంద్రం సాయం అవసరమని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు లేవని, ఇప్పుడు పరిశ్రమలు తీసుకొద్దామంటే విజయవాడ, విశాఖపట్నం నగరాలకు రావటానికి సిబ్బంది రావటంలేదని, ఆ నగరాలలో ఈవెనింగ్ లైఫ్ ఉండదని అంటున్నారని బాబు చెప్పారు.