chandramukhi2 Movie Review
తెలుగు360 రేటింగ్ : 2/5
లకలకలక... ఈ సౌండ్ నిద్రలో విన్నా .. కళ్ళముందు రజనీకాంత్ కదులుతాడు. చారెడేసి కళ్ళతో జ్యోతిక కనిపిస్తుంది. అది చంద్రముఖి మ్యాజిక్. అదే మ్యాజిక్ ని 'నాగవల్లి' సినిమాతో రిపీట్ చేయాలని అనులున్నారు దర్శకుడు పి వాసు. కానీ కుదరలేదు. ఇప్పుడు లారెన్స్ ప్రధాన పాత్రలో చంద్రముఖి 2ని తీసుకొచ్చారు. మరి ఇందులో మళ్ళీ చంద్రముఖి భయపెట్టిందా ? రజనీ స్థానాన్ని లారెన్స్ రిప్లేస్ చేశాడా ? శాంతించిన చంద్రముఖి ఆత్మ మళ్ళీ ఎందుకు బయాటికి వచ్చింది. మరోసారి చంద్రముఖి కోటలో ఏం జరిగింది?
రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబానికి ఏవో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఈ సమస్యలు తీరాలంటే వేటయ్యపాలెంలో ఉన్న వారి కుల దైవం దుర్గమ్మ గుడిలో పూజ జరిపించాలని గురూజీ (రావు రమేష్) సలహా ఇస్తాడు. దీంతో రంగనాయకి కుటుంబ సమేతంగా వేటయ్యపాలెంకు వస్తారు. వీళ్ళకి తోడు మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మదన్ (రాఘవ లారెన్స్) కూడా ఆ ఊరు వస్తాడు. ఈ ఇద్దరు పిల్లలు రంగనాయకి కూతురు బిడ్డలు. మదన్ ఆ పిల్లల కేర్ టేకర్. వీళ్ళంతా అక్కడి రావడానికి ముందే గుడికి దగ్గరలో వున్న చంద్రముఖి కోట ని అద్దెకు తీసుకుంటారు. చంద్రముఖి కోట గురించి రహస్యాలు దాచేసిన బసవయ్య ( వడివేలు) ఆ కుటుంబానికి ఏదోలా ఆ ఇల్లు అమ్మేసి చేతులు దులుపుకోవాలని చూస్తుంటాడు. రంగనాయకి కుటుంబం కోటలో అడుగుపెట్టిన తర్వాత చందముఖి మళ్ళీ యాక్టివ్ అవుతుంది. కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. ఈసారి చంద్రముఖి టార్గెట్ వేటయ్య రాజు (రాజు గెటప్ లో లారెన్స్). అసలు చంద్రముఖి మళ్ళీ ఎందుకు వచ్చింది ? వేటయ్య రాజు ఎవరు ? చంద్రముఖి పగ చల్లారిందా లేదా ? అనేది మిగతా కథ.
చంద్రముఖికి ఒక బ్రాండ్ ఇమేజ్ వుంది. లారెన్స్ కూడా కాంచన ఫ్రాంచైజ్ లో హారర్ తో ఓ ఆట అడేసుకున్నారు. కానీ చంద్రముఖి వరల్డ్ లో రజనీని తప్పా మరొకరిని ఊహించడం కష్టమే. అయినా దర్శకుడిగా పి వాసు, చంద్రముఖిగా కంగనా, కీరవాణీ మ్యూజిక్.. ఇవన్నీ కొంత ఆసక్తిని పెంచాయి. ఐతే ‘చంద్రముఖి 2’ తయారైన విధానం చూస్తే.. ఈమాత్రం కథకి మళ్ళీ సినిమా తీయాలా ? రీరిలీజ్ చేస్తే సరిపోయేదికదా అనిపిస్తుంది. అసలు దీనికి చంద్రముఖి 2 అనే పేరు ఎందుకుపెట్టారో అర్ధం కాదు. చంద్రముఖి స్క్రిప్ట్ ని భద్రగా దాచుకున్న దర్శకుడు., లెంత్ లు కూడా తేడా లేకుండా ఎగ్జాట్ గా చంద్రముఖి మీటర్ లో ఇందులో సన్నివేశాలు నడిపాడు. అయినప్పటికీ ఇందులో చంద్రముఖి ఫీల్ పదిశాతం కూడా రాలేదు.
రంగనాయకి కుటుంబం పరిచయం తర్వాత హీరో లారెన్స్ తెరపైకి వస్తాడు. పిల్లల్ని కాపాడే ఆ ఫైట్ తీసిన విధానం నిజంగా పిల్లాటలానే వుంది. పైగా ఆ పిల్లల ట్రాకు కూడా ఇందులో ఎక్స్ ట్రా. దేవుడా దేవుడా పాట టైపులో ఒక పాట పాడుకొని చంద్రముఖి కోట వైపు వస్తాడు హీరో. అక్కడ కామన్ గా బసవయ్య అండ్ టీం వుంటుంది. నయనతార పాత్ర టైపులో ఇంటిముందు ముగ్గువేస్తూ ఓ పాత్ర రివిల్ అవుతుంది. ఆ పాత్రతో ‘కొంతకాలం కొంత కాలం’ పాట టైపులో ఓ యుగళగీతం కూడా పాడుకుంటాడు. అంతకుముందు 'అథింతోమ్'' పాట టైపులో ఇంట్లో సభ్యులంతా ఇంకో పాట అందుకుంటారు. ఈ గ్యాప్ లో గుడి క్లీన్ చేయడానికి చేసే ప్రయత్నాలు, చంద్రముఖి గది నుంచి సౌండ్లు. ఇంతే.
విరామం ఘట్టం మాత్రం కొంచెం ఆసక్తిగానే వుంటుంది. చంద్రముఖి ఎవరిని ఆవహించిదో అని మానసిక పరిశోధన చేసిన రివిల్ చేసిన విధానం.. పార్ట్ 1 లో చాలా ఆసక్తికరంగా వుంటుంది, ఇందులో మాత్రం అలాంటి ఆసక్తి వుండదు. పైగా ఇందులో గతాన్ని ఎక్కువగా చూపించారు. చంద్రముఖిలో ఒకొక్క ఒక్క సీన్ వుంటుంది, అందులో రజనీ అభినయం అమోఘం. ఇందులో వేటయ్య రాజు అలియాస్ సంగోటయ్య అంటూ సీన్లు సాగదీశారు కానీ అందులో ఎలాంటి ప్రభావం వుండదు. రాజుల కథ అంతా తేలిపోయింది. ఇటు డ్రామా లేక అటు హారర్ కరువై.. సహనానికి ఒక పరీక్షలా మారింది. అయితే ఇందులో వెరైటీగా వున్న అంశం ఏమిటంటే.., చంద్రముఖిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఇందులో మాత్రం ఆమెతో పాటు వేటయ్య రాజు ఆత్మ కూడా బయటికి వస్తుంది. ఈ రెండు ఆత్మలని బయటికి పంపే విధానం మాత్రం మళ్ళీ పాత పద్దతే. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ‘’పాపం పిచ్చితల్లి చంద్రముఖి... మళ్ళీ మోసపోయింది’ అని అనుకోవడం ప్రేక్షకుడివంతు.
చంద్రముఖి వరల్డ్ లో లారెన్స్ ని ఊహించుకోవడం కష్టమే. ఆయన కాంచన కింగ్ ఏమో కానీ ఇక్కడ మాత్రం తెలిపోయాడనే చెప్పాలి. చాలా సన్నివేశాల్లో రజనీని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. చంద్రముఖిలో రజనీ పాత్రకు మంచి ఆర్క్ వుంటుంది. ఆయన స్వతహాగా మానసిక వైద్య నిపుణుడు. అందులో అది చక్కగా కుదిరింది, ఇందులో మాత్రం లారెన్స్ పాత్ర ఇమడలేదు. వేటయ్య పాత్రలోజస్ట్ ఓకే అనిపిస్తాడు. అదేంటో చంద్రముఖి గెటప్ లో కంగనా కనిపిస్తున్నా.. జ్యోతిక మొహమే గుర్తుకువస్తుంటుంది. చివరి పాటలో తన శక్తి మేరకు కష్టపడింది కంగనా. కత్తిసాము కూడా బాగానే చేసింది. చంద్రముఖి ఆవహించిన పాత్రలో చేసిన లక్ష్మీ మీనన్ ఓకే అనిపిస్తుంది. ఓడివేలు పాత్ర ఓ పాత జోక్ లా తయారైయింది. రాధికతో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా సినిమా అంతగా ఆకట్టుకోదు. విజువల్స్ సీరియల్ కలర్ టోన్ లో వున్నాయి. లైటింగ్ చాలా పూర్ గా వుంది. హారర్ కి రావాల్సిన డెప్త్ రాలేదు. అసలు ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అంటే నమ్మలేము. నేపధ్య సంగీతం కూడా భారీ సౌండులు వుంటాయి తప్పా అందులో విషయం వుండదు. ఇది కంటెంట్ లో వున్న లోపమే అనుకోవాలి. పాటలు రిజిస్టర్ కావు. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. గ్రాఫిక్స్ తేలిపోయాయి. పదిహేనేళ్ళ క్రితం ఎంతో క్యాలిటీగా గ్రిప్పింగా తీసిన పి వాసు... పార్ట్ 2ని మరీ తెలిపోయినట్లుగా తీశారు. ఏ ఒక్క అంశంలోనూ చంద్రముఖిని మురిపించలేకపోయింది పార్ట్ 2.
తెలుగు360 రేటింగ్ : 2/5