ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి … ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హింసలో వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని.. మండిపడ్డారు. తమ కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కోడెల శివప్రసాద్.. తన చొక్కా తానే చించుకున్నారని.. అయినప్పటికీ… తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు వీడియో సాక్ష్యాల ఆధారంగా కోడెలపై దాడి చేసిన వారిని పట్టుకుంటున్నారు. ఆయనపై పక్కా ప్రణాళికతో దాడి జరిగినట్లుగా… గుర్తించి ఇప్పటికే.. ఆధారాలు కూడా సేకరించారు. అయినప్పటికీ.. అది తప్పుడు కేసన్నట్లుగా .. జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
గురజాల, కురుపాం, పూతలపట్టు వంటి నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలపై ఎన్నికల సందర్భంగా దాడులు చేశారని చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు మాత్రం.. ఏ చర్యలు తీసుకోలేదంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత.. టీడీపీ నేతలపై.. వైసీపీ నేతలు చేస్తున్న దాడుల విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తావించలేదు. ఈవీఎంల విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను కూడా.. జగన్ తోసి పుచ్చారు. ఇవే ఈవీఎంలతో 2014లో చంద్రబాబు గెలవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెడుతారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నారని జగన్ విమర్శించారు.వీవీప్యాట్‌లో గుర్తు కనిపించలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు. నిజానికి.. వీవీ ప్యాట్‌లో ఏడు సెకన్లు కనిపించాల్సిన గుర్తు మూడు సెకన్లు మాత్రమే ఉంటోందని.. అంటే కోడ్ మార్చారనే కదా అర్థం అని.. టీడీపీ వాదిస్తోంది. కానీ జగన్ మాత్రం.. కనిపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అంటున్నారని, సినిమాలో విలన్లా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు.. తన తదుపరి లక్ష్యంపై గురి పెట్టారు. దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని.. రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో జాతీయ నేతలందర్నీ కూడగట్టారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో.. తాము ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలు.. సోమవారం… ఈసీని కలిశారు. ఈ రోజు… గవర్నర్ ను కలిశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇప్పుడు గవర్నర్ పాత్ర ఏమీ ఉండదు. మొత్తం ఈసీ చేతుల్లోనే ఉంటుంది. అయినా.. గవర్నర్ కు ఏమీ సంబంధం లేకపోయినా.. జగన్.. రాజ్‌భవన్‌కు వెళ్లారంటే.. ఏదో మతలబు ఉందని.. టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.