క్రియేటీవ్ డైరెక్టర్ అనే పిలుపు బాగానే ఉంటుంది. కానీ… కమర్షియల్ డైరెక్టర్ కే వాల్యూ. ఓ సినిమాకి విమర్శకుల ప్రశంసలు వచ్చినంత మాత్రాన చాలదు. కమర్షియల్ గానూ వర్కవుట్ అవ్వాలి. నిర్మాతకు నాలుగు డబ్బులు రావాలి. `మంచి సినిమా తీశారు.. భేష్` అంటూ భుజం తడితే.. అప్పటికి మానసిక సంతృప్తి లభిస్తుందేమో.. అయితే అంతిమంగా ఆ సినిమా జయాపజయాలు నిర్ణయించేది కమర్షియల్ లెక్కలే.
క్రియేటీవ్ డైరెక్టర్ గా చంద్రశేఖర్ ఏలేటికి మంచి పేరుంది. `ఐతే` నుంచి మొన్నటి `మనమంతా` వరకూ దర్శకుడిగా ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. మంచి కథలే. విభిన్న ప్రయత్నాలే చేశాడు. కానీ.. కమర్షియల్ గా ఆ సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడాయన `చెక్` రూపంలో మరో ప్రయత్నం చేశారు. శుక్రవారమే విడుదల. చెక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో… `ఈ సినిమాతో మీకు మంచి పేరొస్తుంది` అని చంద్రశేఖర్ ఏలేటిని ఉద్దేశించి నితిన్ పొగిడితే.. `నాకు పేరొద్దు.. డబ్బులు కావాలి` అని చందూ వెంటనే జవాబు ఇచ్చారు. దాన్ని బట్టి… చంద్రశేఖర్ యేలేటి కమర్షియల్ హిట్ ని ఎంతగా కోరుకుంటున్నాడో అర్థం అవుతోంది.
తాను కమర్షియల్ సినిమాలూ తీయగలనని నిరూపించుకోవడానికి `చెక్` ఓ ఆసరా. దాన్ని చంద్రశేఖర్ బాగానే వాడుకున్నాడని టాక్. ఈసారి ఎలాగైనా సరే, డబ్బులొచ్చే సినిమానే తీయాలి… అని చందూ ఫిక్సయ్యాడని, అందుకే `చెక్`లో కమర్షియాలిటీ బాగా మిక్స్ చేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. అలాగని.. తన శైలికి భిన్నంగా భారీ ప్రయోగాలేం చేయలేదు. అందులో తన టచ్ ఉండేలానూ జాగ్రత్త పడ్డాడట. చందూ లాంటి దర్శకులకు ఒకట్రెండు కమర్షియల్ హిట్స్ పడడం అవసరం. ఎందుకంటే.. అప్పుడే కొత్త తరహా సినిమాల్ని ఇంకాస్త ధైర్యంగా తీయగలగుతారు. మరి… `చెక్` చందూలోని కమర్షియాలిటీని బయటకు తీసుకొస్తుందా? లేదంటే పూర్తిగా తన సృజనాత్మకతకే చెక్ పెడుతుందా? అనేది తేలాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.