రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అమరావతిలో అద్భుతమైన రాజధాని నగర నిర్మాణం చేపట్టారు. తాత్కాలిక రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. తాత్కాలిక సచివాలయానికి కూడా కొబ్బరి కాయ కొట్టారు. అంతా బాగానే ఉంది. మరి రాజధాని లో హైకోర్టు అవసరం లేదా? తెలంగాణ మంత్రి కేటీఆర్ అడిగిన సూటి ప్రశ్న ఇది. తాత్కాలిక రాజధాని నుంచే పరిపాలన మొదలుపెట్టడం అభినందనీయం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి హైకోర్టు అక్కర్లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
హైకోర్టు విభజన కోసం తెలంగాణలో న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. సస్పెన్షన్లను లెక్కచేయకుండా న్యాయం కోసం పోరాడుతామంటున్నారు. ఏపీలో మాత్రం ఈ ఊసే లేదు. ఎవరి రాష్ట్రాన్ని వాళ్లు అభివృద్ధి చేసుకుందామంటూ ఇద్దరు ముఖ్యమంత్రులూ కలుసుకున్న ప్రతిసారీ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అయితే హైకోర్టు విభజన విషయంలో కేసీఆర్, చంద్రబాబుల వైఖరి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని అంశాలనూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం, రాజకీయ నాయకులు పదే పదే కోరుతున్నారు. చట్టంలో లేని ప్రత్యేక హోదా గురించీ రోజూ మాట్లాడుతున్నారు. కానీ హైకోర్టును విభజించాలనే డిమాండ్ ఏపీలో ఎక్కడా వినపడటం లేదు. అధికార, ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. మరి వారికి ప్రత్యేక హైకోర్టు అవసరం లేదా అనేది ప్రశ్న.
ఉమ్మడి హైకోర్టులో తమకు అన్యాయం జరుగుతోందనేది తెలంగాణ వాదుల వాదన. న్యాయాధికారులు, న్యాయవాదుల మాట కూడా అదే. విచిత్రంగా ఏపీలో మాత్రం హైకోర్టును విభజించాలనే ఊసేలేదు. పదే పదే ఢిల్లీకి వెళ్లి పలు డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందుంచే చంద్రబాబు నాయుడు, హైకోర్టు విభజన కోసం న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను ఎన్నిసార్లు కలిశారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అనే ప్రశ్నకు చంద్రబాబు ఏం జవాబు చెప్తారో మరి.