సిల్క్ స్మిత వెండితెరపై ఒక సంచలనం. ఆమె వ్యక్తిగత జీవితం ఇంకా సంచలనం. తెరపై గ్లామరస్ తారగా వెలిగిన సిల్క్ స్మిత.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడం ఇప్పటికీ సంచలనమే. ఆమె జీవితం ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ఫేం చంద్రిక రవి సిల్క్ స్మితగా తెరపై కనిపించనుంది. జయరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ని వదిలారు.
తాజాగా ఈ చిత్రంలోని తన పాత్ర, సిల్క్ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు చంద్రిక. ‘నన్ను కొందరు సిల్క్ స్మితలా వుంటావ్ అని అంటారు. నల్లగా సోగ కళ్లతో ఉండేవారిని సెక్స్ సింబల్స్ గా చూడటం అలవాటైపోయింది. నా ప్రయాణంలో కూడా ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఈ కారణాల వల్ల నాకు ఎందుకో సిల్క్ కనెక్ట్ అయింది. ఆమె గురించి తెలుసుకుంటున్న కొలది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సిల్క్ జీవితంపై కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అవేమి ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి కావు. ఆ సినిమాలన్నీ ఆమెను ఒక సెక్స్ సింబల్‌గా మాత్రమే చూపించాయి. సిల్క్ స్మిత కేవలం సెక్స్ సింబల్ కాదు. ఆమె జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వున్నాయి. ఆమె జీవితానికి తెరరూపం ఇవ్వడానికి వారి కుటుంబ సభ్యులు అనుమతి తీసుకున్నాం. ఈ బయోపిక్ లో అసలైన సిల్క్ స్మితని చూస్తారు” అని చెప్పుకొచ్చారు చందిక్ర.