సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన తెలుగు సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఇందులో ‘చంద్రుడిలో ఉండే కుందేలు…’ పాట గుర్తుందా? సూపర్‌హిట్ సాంగ్. సినిమా విడుదలైన సమయంలో ఎక్కడ చూసినా విపరీతంగా వినిపించేది. ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకున్న ముగ్గురు వ్యక్తులు ఈ పాటకు పని చేయడం విశేషం!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికి దర్శకుడు ప్రభుదేవా. ఆయనకు ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చింది. అలాగే, ఈ పాటను రాసిందీ ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతే. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ఆయనకూ ఈ ఏడాదే వచ్చింది. ఈ పాటను పని చేసిన మరో ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత గాయకుడు శంకర్ మహదేవన్. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కల్పనతో కలిసి ‘చంద్రుడిలో ఉండే కుందేలు…’ పాటను శంకర్ మహదేవన్ పాడారు.
‘సిరివెన్నెల’ రాసిన పలు పాటను ఆయన ఆలపించారు. తెలుగులో శంకర్ మహదేవన్ – ఎహసాన్ – లాయ్ సంగీతమందించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రంలో సిరివెన్నెల నాలుగు పాటలు రాశారు. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నవారిలో ముగ్గురు సిరివెన్నెల, ప్రభుదేవా, శంకర్ మహదేవన్ గతంలో ఓ చిత్రానికి, ఓ పాటకు పని చేయడం విశేషమే.