కార్తికేయతో ఆకట్టుకొన్నాడు చందూ మొండేటి. ఇప్పుడు ప్రేమమ్ తో మరో పది మెట్లు ఎక్కినట్టే. మలయాళంలో ఓ క్లాసిక్ అనదగ్గ చిత్రమిది. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేసి, అందరి చేతా… సెభాష్ అనిపించుకోవడం మాటలు కాదు. మాతృకలోని మనసుని ఒడిసిపట్టుకొని, దానికి ఓ కొత్త భాష్యం చెప్పడం.. అందరికీ నచ్చింది. నవతరం హీరోలు, నిర్మాతలూ ఇక మీదట చందూ మొండేటిపై ఫోకస్ పెట్టడం ఖాయం. అయితే ఇది వరకే చందూ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఐడ్రీమ్స్ప్రొడక్షన్స్ సంస్థ చందూతో ఓ సినిమాని పట్టాలెక్కించడానికి రంగం సిద్దం చేసుకొంది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించే అవకాశం ఉంది. చందూనీ వరుణ్తేజ్నీ కలపాలని, వీరిద్దరి కాంబోలో ఓ సినిమా చేయాలని ఐ డ్రీమ్ సంస్థ ప్రయత్నిస్తోంది.
ప్రేమమ్ హిట్టు తరవాత చందూతో సినిమా చేయడానికి వరుణ్ తేజ్ ఇసుమంత కూడా ఆలోచించడు. మరోవైపు నాగచైతన్య చందూని వదిలిపెట్టడానికి సిద్దంగా లేడు. తనతో మరో సినిమా చేస్తానని ఇది వరకే చెప్పాడు. త్వరలో కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య సినిమా పట్టాలెక్కబోతోంది. అది పూర్తయ్యే సరికి కనీసం 6 నెలల సమయమైనా పడుతుంది. ఈలోగా.. వరుణ్ – చందూ మొండేటి సినిమా పూర్తయిపోతుంది కూడా. వరుణ్ మిస్టర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఫిదా నడుస్తోంది. ఇవి రెండూ పూర్తయ్యాక చందూతో సినిమా పట్టాలెక్కుతుంది.