ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానంలో కొన్ని లోపాల వలన రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడటం వలన ఇసుక ధర అమాంతం పెరిగిపోయింది. ప్రజలకు, డ్వాక్రా మహిళా సంఘాలు, రైతు సాధికార సంఘాలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నూతన ఇసుక విధానం అమలుచేస్తున్నపటికీ, అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం వలన అది తెదేపా నేతలకు లబ్ది చేకూర్చేందుకే అమలవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇసుక మాఫియా గురించి మీడియాలో వస్తున్న వార్తలు వారి వాదనలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక తవ్వకాలు, సరఫరా, అమ్మకాలపై ఒక ప్రైవేట్ సంస్థ ద్వార సర్వే చేయించుకొని నివేదిక తెప్పించుకొన్నారు.
దానిలో అనేక లోపాలు బయటపడ్డాయి. మహిళా, రైతు సంఘాలపై అధికారుల పెత్తనం, మళ్ళీ వారిపై ప్రజా ప్రతినిధుల పెత్తనం, ఈ కారణంగా ఇసుక ర్యాంపుల నిర్వహణలో లోపాలు, జరుగుతున్న అక్రమాలు, ఇతరత్రా అనేక కారణాలను నివేదిక బయటపెట్టింది. తత్ఫలితంగా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటం, ఇసుక ధరలు పెరిగిపోవడం, వీటికి కొన్ని ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఆ నివేదికలో పేర్కొనబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో ఆ వివరాలనిటినీ కూడాచేర్చడం ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నట్లు అర్ధం అవుతోంది.
శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో లోపాలున్నట్లు గుర్తించాము. కనుక ఇరుగు పొరుగు రాష్ట్రాలు అమలుచేస్తున్న ఇసుక విధానాలను పరిశీలించి, వాటితో మనం అమలుచేస్తున్న విధానాన్ని కూడా బేరీజు వేసుకొంటాము. ప్రజాభిప్రాయం కూడా తెలుసుకొన్న తరువాత అన్నివిధాలా మేలయిన లోపరహితమయిన ఇసుక విధానాన్ని జనవరి 1వ తేదీ నుండి అమలు చేస్తాము. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రూ. 517.36 కోట్ల రాబడిలో మహిళా, రైతు సాధికార సంఘాలకు చెరో 25శాతం వాటా ఇస్తున్నాము. వచ్చే ఏడాది నుండి ప్రవేశపెట్టబోయే కొత్త విధానంలో కూడా అదేవిధంగా వారికి వాటా ఇస్తాము. ఈ ఇసుక తవ్వకాలలో పర్యావరణాన్ని కాపాడుకొంటూ అవినీతిని అరికట్టి ప్రజలకు, మహిళా, రైతు సంఘాలకు, ప్రభుత్వానికి అందరికీ ప్రయోజనం కలిగించడమే మా ఉద్దేశ్యం. కనుక మా విధానం లో లోపాలను సమీక్షించుకొని సవరించుకోవడానికి మేము వెనుకంజ వేయము,” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.