ఆంధ్రప్రదేశ్లో అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొంతమందితో ఓ కోటరీ ఏర్పాటు చేసుకుని కీలక పోస్టింగులు పొందిన అధికారులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో కొంత మందిపై ఈసీ వేటు వేసింది. కానీ వారి కన్నా ముందు అసలైన స్వామి భక్తులైన పెద్దలు పదవుల్లోనే ఉన్నారు. వారి విషయంలోనూ ఈసీ కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపూర్తి స్థాయి డీజీపీ కాదు. ఆయన ఇంచార్జ్ డీజీపీనే. తమకు దగ్గర వ్యక్తి అన్న కారణంగానే ఆయనను ఇంచార్జ్ డీజీపీగా నియమించారు. ఇప్పటి వరకూ ఆయనను పూర్తి స్థాయి డీజీపీగా నియమించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం ఆయనకు అర్హత లేదు. సీనియార్టీలో ఆయన పదకొండో స్థానంలో ఉంటారు. టాప్ ఫైవ్ అధికారుల్లోనే ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికే ఆయనను నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఫిర్యాదుల వెల్లువ వస్తోంది. ఈసీ ఇంచార్జ్ డీజీపీతో ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించబోదని చెబుతున్నారు.
ఇక చీఫ్ సెక్రటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్వామిభక్తే ఆయనను సీఎస్ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆయన పేరు జవహర్ రెడ్డి. ఆయన విధులు నిర్వహిస్తారా.. సజ్జల రామకృష్ణారెడ్డినా అన్న డౌట్ చాలా మంది అధికారుల్లో ఉంటుంది. ఆయన అంతగా జోక్యం చేసుకుంటారు. ఎన్నికల సమయంలో ఆయన హద్దుమీరిపోతున్నారు. పించన్ల వ్యవహారంలో ఆయన తీరు అనుమానాస్పదంగా మారింది. సీఈవోను డామినేట్ చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దీనిపై ఈసీ సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది.
ఇక ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా గతంలోనే కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. తాజాగా వర్ల రామయ్య కూడా ఫిర్యాదు చేశారు. ఇక విజిలెన్స్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడం సహజంగా మారిపోయింది., వీరందరిపై చర్యలు తీసుకుంటేనే.. ఎన్నికలు సజావుగా సాగుతాయని.. ఎన్నికల ప్రక్రియకు.. విధులకు దూరంగా ఉంచకపోతే.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలకు అర్థమే ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఈసీ చర్యలు తీసుకుంటారని.. విపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి.