ప్రజాభిప్రాయం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలను ఏర్పాటు చేయలేదని.. వాటిని మళ్లీ పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన జిల్లాలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదన్నారు.
పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే తరహా విభజన వల్ల ప్రజలకు ఏ విధంగా పాలన దగ్గర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతోందని ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చివరిలో తెలిపారు. అయితే ఎలా పునర్ వ్యవస్థకరిస్తారో పవన్ చెప్పలేదు.
అయితే అధికారంలో ఉంటే తప్ప జిల్లాలను మార్చలేరు.అంటే తమకు అధికారం అందిన తర్వాత జిల్లాలను మారుస్తామని పవన్ నేరుగా చెప్పినట్లు అనుకోవచ్చు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ప్రజా ఉద్యమాలు లేదా.. ప్రజా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడతారేమోచూడాలి.