కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహించే శక్తి సామర్ధ్యాలు, దానిని విజయపథంలో నడిపించే తెలివి తేటలు లేవని ఇప్పటికే చాలాసార్లు రుజువయ్యింది. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడితే అది మరొక్కసారి రుజువు అవుతుంది. బహుశః అందుకే ఆయన జ్వరం తెచ్చుకొన్నారేమోనని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోయింది. చివరికి రాష్ట్రాలలో సైతం అది ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పొత్తులేకుండా గెలిచే పరిస్థితి లేదు. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలలో అయితే అదే ప్రాంతీయ పార్టీలకి తోక పార్టీగా మారిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, తెలంగాణాలో తన ఉనికిని కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తోంది. ఉత్తరాదిన చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ పట్టుకోల్పోపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని వెతుకోవలసిన దుస్థితి ఏర్పడవచ్చు.
దీనికి ప్రధాన కారణం నాయకత్వ లోపమేనని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించింది. కానీ ఆ విషయాన్ని ఓ ‘స్పెషలిస్టు’ ద్వారా చెప్పించుకొన్నాక గానీ ప్రత్యామ్నయం గురించి ఆలోచించలేదు. ఇంతకీ ఆ స్పెషలిస్టు ఎవరంటే 2014 ఎన్నికలలో మోడీని, బిహార్ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ల విజయానికి తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ప్రశాంత్ కిషోర్.
వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవలసి ఉంది కనుక, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ ఎన్నికల స్పెషలిస్టుని సలహా కోరింది. ఆయన ఏమి చెప్పారంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టం కనుక ప్రియాంకా వాద్రాని ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ అధిష్టానానికి అభ్యంతరం లేదనుకొంటే రాహుల్ గాంధీని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించవచ్చు. కానీ ప్రియాంకా వాద్రా నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్ళడం మంచిది,” అని చెప్పారు. ఈ మాటలనే ఆయన వారు హర్ట్ అవకుండా కొంచెం మృదువైన పదాలు ఉపయోగించి చెప్పారు.
రాహుల్ విషయంలో ఆయన సలహా పాటించాలా వద్దా? అని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం ప్రియాంకా వాద్రాని తీసుకురాక తప్పదని కాంగ్రెస్ నేతలు కూడా కోరుకొంటున్నారు కనుక ఆ విషయంలో అయన సలహా పాటించడమే మంచిదని భావిస్తునట్లు తెలుస్తోంది.
ఈ వార్తలపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ “ప్రియాంకా వాద్రా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని మేమందరం చాలా కాలంగా కోరుకొంటున్నాము. ఆమె వస్తారా రారా అనేది ఆమె కుటుంబ సభ్యులు తేల్చుకోవాలి. ఆమె అచ్చం స్వర్గీయ ఇందిరాగాంధీ పోలికలు, లక్షణాలు కలిగి ఉండటం మా పార్టీకి చాలా కలిసి వచ్చే అంశమే. ఆమెకు కూడా ఇందిరా గాంధీ అంత శక్తియుక్తులు ఉన్నాయా లేదా అన్నది ఆమె రాజకీయాలలోకి వస్తే గానీ చెప్పలేము. ఆమె వస్తానంటే ఆనందంగా స్వాగతిస్తాము,” అని చెప్పారు.
అంటే కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా వాద్రాని ముందుకు తీసుకురాబోతున్నట్లు మీడియాకి లీకులు ఇవ్వడం మొదలుపెట్టినట్లే భావించవచ్చు. ఒకవేళ ఆమెను తీసుకువస్తే దానర్ధం ఏమిటంటే, రాహుల్ గాంధీపై నమ్మకం లేకనే ఆమెని తెస్తున్నట్లు కనుక పార్టీ పగ్గాలు కూడా ఆమెకే అప్పగించవచ్చు. మరి రాహుల్ గాంధీ ఏమి చేస్తారు? అంటే శాశ్విత ఉపాధ్యక్షుడుగా సెటిల్ అయిపోతారేమో?