తెలంగాణలో 10 జిల్లాలు కాస్తా 31 జిల్లాలయ్యాయి. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిందేనని పలువురు సూచిస్తున్నారు. లేకపోతే ఉద్యోగాల భర్తీ చట్టరీత్యా చెల్లుబాటు కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో, 1975లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం ఆ ఉత్వర్వులు వెలువడ్డాయి.
కొత్త జిల్లాల్లో నియామకాలకు సాంకేతికంగా ఆటంకాలు ఎదురు కావద్దంటే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేంద్రాన్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ గెజిటెల్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ కూడా ఇదే విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలన్నా, రద్దుచేయాలన్నా ఆనాటి ఉత్తర్వుల సవరణ అనివార్యమని కూడా ఆయన చెప్పారు.
ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ తాజా నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లోకి రాకముందు ఆ నోటిఫికేషన్ జారీ అయింది. కాబట్టి ఆ ఉద్యోగల భార్తీకి ఇబ్బంది ఉండదు. ఇక ముందు మాత్రం కొత్త జిల్లాల్లో ఉద్యోగ నియామకాలుజరగాలంటే ఉత్తర్వుల సవరణ తప్పదంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. జిల్లాల సంఖ్యను మూడు రెట్లు పెంచింది. అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు, అవసరమైన ఉద్యోగాల భర్తీకి సన్నాహాలుచేస్తోంది. అయితే 1975నాటి రాష్ట్రపతి ఉత్వర్వులను వీలైనంత త్వరగా సవరించడం అనివార్యంగా కనిపిస్తోంది.