శుక్రవారం విడుదలైన `చెక్` చూసి ప్రేక్షకులు విస్మయ పోయారు. ముఖ్యంగా చంద్రశేఖర్ యేలేటి అభిమానులు. ఐతే, అనుకోకుండా ఓ రోజు లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నాడు చందూ. క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. `చెక్`… పేరుకు తగ్గట్టే, చందూ తెలివితేటలు సినిమాపై కనిపిస్తాయనుకున్నవాళ్లకు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి, పెదవి విరుస్తున్నారంతా. కథని ఎటూ కాకుండా అలా వదిలేశాడేంటి? అన్నది `లా` పాయింటు.
తాను నిర్దోషిగా నిరూపించుకోవాలని, క్షమాభిక్షతో బయటకు రావాలన్నది ఇందులో హీరో ప్రయత్నం. అయితే ఈ రెండూ జరగవు. క్లైమాక్స్ లో హీరో జైలు నుంచి పారిపోతాడు. అక్కడితో కథకు ఎండ్ కార్డు వేశారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఆలోచించాడట చందూ. ఆ సీక్వెల్ లో తాను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడన్నది కథట. నిజానికి.. ముందు రాసుకున్న స్క్రిప్టు ప్రకారం అయితే… హీరో నిర్దోషిగా నిరూపించుకోవడంతో కథ ముగుస్తుందట. అయితే.. సినిమా జరిగే ప్రోసెస్లో దర్శకుడికి సీక్వెల్ ఆలోచన రావడం, దానికి హీరో కూడా ఓటేయడంతో, క్లైమాక్స్ ని మార్చారని టాక్. నితిన్ కూడా `ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది` అని ఇది వరకే ప్రకటించేశాడు. సీక్వెల్ ఆలోచన లేకపోతే, ఈసినిమా క్లైమాక్స్ మరోలా ఉండేది. క్లైమాక్స్ మారితే, ఫలితాలేం మారిపోవు గానీ, కాస్త బెటర్ సినిమా అయ్యేది. ఆ అవకాశం పాడు చేసుకుని, సీక్వెల్ కోసం చూసి, కథని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు సినిమా పోయింది.. సీక్వెల్ పై ఆశా పోయింది.