ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు యాభై మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు జ్యూరిక్ వెళ్లడానికి ముందే ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి వెళ్లారు. అన్ని పనులు పూర్తయిన తర్వాత అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ విషయంలో పెద్దగా సంచలనాలు లేవు. వైసీపీతో అంట కాగిన కొంత మందికి పోస్టింగులు ఇచ్చారు. వారి భవిష్యత్ కోసం సానుభూతితో వ్యవహరించారు. కానీ అత్యంత ఘోరంగా వ్యవహరించిన రిశాంత్ రెడ్డి వంటి వారి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పాలనా వ్యవస్థకు అత్యంత కీలకం అయిన ఐఏఎస్‌ల బదిలీల్లో మాత్రం సంచలనాలు ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ అవుతారు అనుకున్న సాయిప్రసాద్ కు ఆ చాన్స్ రాలేదు. చివరికి విజయానంద్‌కు దక్కింది. ఆయన రిటైరన తర్వాత సాయి ప్రసాద్ కు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో సాయి ప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్టు చేసేలా ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చాన్స్ ఇచ్చారు. అంతా ఉన్నత స్థాయిలో అధికారుల్ని మార్చారు. సీఆర్డీఏ కమిషనర్ ను మార్చడం కూడా సంచలనమే. కాటమనేని భాస్కర్ కు నారాయణతో సరిపడకపోవడంతో మార్చాల్సి వచ్చింది.
మొత్తంగా పోలీసు, పాలనా వ్యవస్థలో పై స్థాయిలో ప్రక్షాన దాదాపుగా పూర్తి చేశారు. ఏడు నెలల కాలంలో జరిగిన పాలన..అధికారులు వ్యవహరించిన తీరు.. ఎక్కడెక్కడ ఎలాంటి అధికారుల్ని నియమించుకోవాలో కసరత్తు చేసి.. ఈ మేరకు బదిలీలు పూర్తి చేశారు. వైసీపీ హాయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల పని తీరు భిన్నంగా ఉంటుంది. అలాంటి పని తీరు అవసరం లేదనుకుంటున్న ప్రభుత్వం.. తమ పాలనకు సింక్ అయ్యే వారికి ఎక్కువ అవకాశాలు కల్పించింది.