ప్రస్తుతం రాజస్థాన్‌లోని నాగూర్‌లో జరుగుతున్నాయి. ఆరెస్సెస్ కీలక సమ్మేళనాలు కొన్ని మార్పులు ప్రకటించడం ఆసక్తికరం. మొదటిది ఖాకీ నిక్కరు, తెల్లచొక్కాగా వున్న యూనిఫాంను బ్రౌన్ ప్యాంటుగా మార్చాలని నిర్ణయించారు. అయోధ్య ఘటనల అనంతరం ఖాకీ నిక్కరు కాషాయ పతాకం అంటూ పుస్తకాలు వెలువడ్డాయి కూడా. ఎట్టకేలకు ఇప్పుడు కాలానుగుణంగా నిక్కరు స్థానే ప్యాంటు వుండాలనుకోవడం బాగానే వుంది. . ఇక్కడ ఒక తమాషా ఏమంటే ఆరెస్సెస్‌కు మొదట్లో ప్రేరణగా భావించే హిట్లర్నాజీ కార్యకర్తలు బ్రౌన్ షర్టులే ధరించేవారన్నది కుతూహలం కలిగిస్తుంది. మళ్లీ దీనిపై ఏదైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి. యూనిఫాం కంటే ముఖ్యంగా విధానవిషయాలలోనూ కాస్త పట్టువిడుపులు ప్రదర్శించడం గమనించదగింది. శనిసింగారం, త్రయంబకేశ్వర్, శబరిమలై వంటి క్షేత్రాలలో స్త్రీలను అనుమతించాలనే వాదనకు ఆరెస్సెస్ మద్దతునిచ్చింది. అయితే ఇందుకు ఆందోళనలు గాక సంప్రదింపులు జరగాలని సూచించింది. కుల వివక్షకు మూల గ్రంధంగా భావించే మనుసృతిని ఇటీవల జెఎన్‌యు ఘటనల తర్వాత సంఘ పరివార్ సభ్యులొకరు తగలబెట్టడం కూడా ఈ తరహా మార్పే. రవిశంకర్ గురూజీ వేడుకలకు సంబంధించి తలెత్తిన పర్యావరణ వివాదాలపై వ్యాఖ్యానిస్తూ ఎవరైనా నిబంధనల ప్రకారం నడుచుకోవలసిందేనని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి సలహా ఇచ్చారు. అయితే కావాలని వివాదం చేయకూడదని కూడా ముక్తాయించారు. ఆరెస్సెస్ కూడా కొంత మారినట్టు కనిపించే ప్రయత్నం చేస్తున్నదన్న మాట. మతచాందసాన్నివదిలితే మంచిదే