నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెన్నైలో నిర్వహిస్తున్న సమావేశం తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రేవంత్, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోబోతూండటమే. తమ ఉమ్మడి శత్రువు బీజేపీ అని ఇద్దరూ డిక్లేర్ చేస్తున్నట్లే . ఓ ప్రత్యేకమైన అంశం పై మాత్రమే ఈ పోరాటం అని చెప్పినా సరే.. సామాన్య జనంలోకి అలాంటి అభిప్రాయం వెళ్లదు. రెండు పార్టీలు కలిసి పని పని చేస్తున్నాయని అనుకుంటారు.
ఒకే వేదికపై కేటీఆర్, రేవంత్
ఇండియా కూటమిలో కీలకమైన పార్టీ డీఎంకే. ఆ పార్టీ ఓ విధానం తీసుకుని సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ అలా చేయడం కరెక్ట్ కాదని వద్దని చెప్పలేదు. అలా చెబితే కూటమి చీలిపోతుంది. స్టాలిన్ ను గౌరవించడానికి ఆ స్థాయి నేతల్ని కాంగ్రెస్ పంపాల్సిందే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండు దక్షిణాదిలోనే ఉన్నాయి. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి.. తెలంగాణ నుంచి సీఎం వెళ్తేనే …స్టాలిన్ ను గౌరవించినట్లు. అందుకే హైకమాండ్ రేవంత్ నే వెళ్లాలని ఆదేశించింది. ఆయన వెళ్తున్నారు.
తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు సంకేతం
కేటీఆర్ కూడా డీఎంకే నేతలు వచ్చి పిలిచినప్పుడే కమిట్ అయ్యారు. తాను వస్తానని చెప్పారు. ఆ ప్రకారం హాజరవుతున్నారు. ఈ సమావేశం ఎజెండా బీజేపీని టార్గెట్ చేయడమే. అందులో సందేహం ఉండదు. ఇక్కడే సమీకరణాలు మారిపోతాయి. రేవంత్, కేటీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారు. అదే ఫార్ములా తెలంగాణకు అన్వయించేందుకు ఓ అవకాశం .. ఏర్పడినట్లే . ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ రాజకీయాలకు ఇదో పునాది అవుతుంది.
ఎన్డీఏకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కూటమి ?
ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ఉంటుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలంటే.. టీడీపీ, జనసేనతో కలవడం మంచిదని బీజేపీ హైకమాండ్ అనుకుంటోందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే.. నలిగిపోతుంది. బీజేపీ కలుపుకునే అవకాశం లేదు కాబట్టి మెల్లగా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఓ అడుగు చెన్నైలో పడుతుందని అనుకోవచ్చు.