కరోనా ముందు..
కరోనా తరవాత..?
– ప్రస్తుతం ప్రపంచం నడవడిక, మనుషులు ఆలోచించే విధానం, బతుకులు రెండు రకాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా థియేటర్ వ్యవస్థలో కీలకమైన మార్పులు చూడొచ్చు.
ఇది వరకటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? థియేటర్లు నిండుతాయా? అనే భయం అందరిలోనూ ఉంది. దానికి ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ఒకట్రెండు పెద్ద సినిమాలు విడుదలైతే గానీ, పరిస్థితేంటి అనేది చెప్పలేం. కానీ…. థియేటర్ ఆక్యుపెన్సీ పెంచడం ఎలా? అనే విషయంలో మాత్రం తర్జన భర్జనలు గట్టిగానే జరుగుతున్నాయి. ఒకొక్కరూ ఒక్కో సలహా ఇస్తున్నారు. ఎవరెన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, చేయకపోయినా – కొత్త థియేటర్ వ్యవస్థనైతే మాత్రం చూడడం ఖాయం.
జనం గుమిగూడే చోట కరోనా ఆపద ఎక్కువగా ఉంటుంది. అందుకే థియేటర్లకు అనుమతి ఇవ్వడం లేదు. సీట్ల అమరికలోనూ త్వరలో చాలా మార్పులు రాబోతున్నాయి. అయితే వాటన్నింటికంటే ముందు థియేటర్లో కొన్ని మౌళిక మైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మినీ థియేటర్లు విరిగా నిర్మించే ఛాన్స్ ఉంది. 100నుంచి 150 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది వరకు ఓ సారి విధి విధానాల్ని రూపొందించింది. ఆ తరవాత వాటి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మినీ థియేటర్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మల్లీప్లెక్స్ థియేటర్‌కి ఓ మధ్య తరగతి కుటుంబం వెళ్లేలా వెసులు బాటులు కల్పించాలి. పార్కింగ్ ఫీజు పూర్తిగా ఎత్తేయాలి. సాధారణంగా మల్టీప్లెక్స్‌లో వీక్ ఎండ్‌లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్, అందులోనూ మార్నింగ్ షోలలో ఆక్యుపెన్సీ తక్కువ. అలాంటప్పుడు టికెట్ రేట్లు తగ్గించాలన్నది ఓ ప్రతిపాదన. దాని గురించి కూడా ఇప్పుడు చిత్రసీమ సీరియస్‌గా ఆలోచించాలి. సింగిల్ స్క్రీన్స్‌లో సిట్టింగ్‌ని బట్టి రేటు ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్‌లో మాత్రం సిట్టింగ్ ఎక్కడైనా – ఒకటేరేటు. ఈ విషయంపై కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.
థియేటర్లో తినుబండారాలు అత్యంత ప్రియం. బయట కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ధర చెల్లించాలి. ముందు ఆ రేట్లని క్రమబద్ధీకరించాలి. ఇంట్లోంచి థియేటర్‌కి తినుబండారాల్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ మధ్య తరగతి ప్రేక్షకుడిని ఆకర్షించేవే. ఈ మార్పులతో కూడిన కొత్త థియేటర్లు చూడగలిగితే – తప్పకుండా థియేటర్లకు కొత్త కళ వస్తుంది.