తెలంగాణ బీజేపీలో హైకమాండ్ చేసిన మార్పులు ఆ పార్టీలో పెద్ద కుదుపు సృష్టించేలా ఉన్నాయి. మార్చిన పదవులపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. చివరికి కిషన్ రెడ్డి కూడా అంత ఉత్సాహంగా లేరు. ఆయన కేంద్ర మంత్రిగా అధికారికంగా రాజీనామా చేయకుండా.. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కేబినెట్ భేటీకి గైర్హాజర్ అయ్యారు. దీంతో ఆయన అలిగారని విస్తృతంగా ప్రచారం జరిగింది. చివరికి మీడియా ముందుకు రాక తప్పలేదు.
తనకు అసంతృప్తేమీ లేదని.. తాను అలగలేదని.. కిషన్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే ఆయన మాటల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా బయట పడింది. ఉమ్మడి రాష్ట్రానికి తాను రెండు సార్లు చీఫ్ గా చేశానని..తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. ఇప్పుడు నాలుగోసారి ఆ బాధ్యతలిచ్చిందన్నారు. అంటే.. అంతకంటే పెద్ద పదవికి వెళ్లాల్సిన తనను ఇలా నియంత్రించారన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఉన్న పళంగా నియామకం అమల్లోకి వస్తుందని జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేస్తే.. ప్రధాని వరంగల్ సభ తర్వాత చార్జ్ తీసుకుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు.
మరో వైపు బండి సంజయ్ కూడా అసంతృప్తికి గురయ్యారన్న బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే తనకు ఏ పదవి వద్దన్నారని..తెలంగాణలో పార్టీ కోసం పని చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ బీజేపీలో ఆయనకు మద్దతుగా భారీగా సోషల్ మీడియా ఉద్యమం సాగుతోంది. బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసిన బండి సంజయే సరైన చాయిస్ అని అంటున్నారు. మిగిలిన చాలా మంది నేతలు.. కిషన్ రెడ్డిని స్వాగతించడానికి.. వ్యతిరేకించడానికి ముందుకు రావడం లేదు. అంతా సైలెంట్ గా ఉంటున్నారు.