‘పింక్’ రీమేక్‌పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీలో చేయబోతున్న సినిమాల్లో ఇదొకటి. అయితే ‘పింక్’ కథ ఇప్పటికే బాగా నలిగిపోయింది. తమిళంలోనూ రీమేక్ అయిన సినిమా ఇది. ఇక్కడి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ‘పింక్’ని ఇది వరకే చూసేశారు. కథేమిటి? ఇందులో పవన్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుంది? అనేవి వాళ్లకు తెలుసు. ఇది వరకు ‘పింక్’ చూసినవాళ్లకు సైతం పవన్ ‘పింక్’ కొత్తగా కనిపించేలా.. చిత్రబృందం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది.
కథ, స్క్రీన్ ప్లే, అమితాబ్ పాత్ర.. వీటిలో కొన్ని కీలకమైన మార్పులు చేయబోతోంది. పింక్‌లో అమితాబ్ వృద్ధ లాయర్. ఆ పాత్రని పవన్ చేస్తున్నాడు కాబట్టి – అదే గెటప్‌లో చూపిస్తే బాగోదు. దాంతో పాటు ఆ పాత్ర నేపథ్యం, స్టైల్ అన్నీ మారతాయి. కోర్టు వాదనలే.. ఈ కథకు మూలం. దాంట్లో వేలు పెట్టే సాహసం తెలుగు రూపకర్తలు చేయకపోవచ్చు. మిగిలిన పాత్రల నేపథ్యాల్ని మారిస్తే ఈ కథకు ఓ కొత్త అందం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది వరకు ‘ఓ మై గాడ్’ విషయంలోనూ ఇదే జరిగింది. దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు పవన్ అభిమానులకు నచ్చేలా కొన్ని మార్పులూ చేర్పులూ చేశారు. ‘కొన్ని కొన్ని సార్లు రావడం లేటవ్వచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా’ లాంటి డైలాగులు జోడించారు. ‘పింక్’ కోసం కూడా అదే ప్రయత్నం జరుగుతోంది.