చిరంజీవి దృష్టిలో పడిన మరో రీమేక్.. ‘లూసీఫర్’. మోహన్ లాల్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్యతల్ని చిరంజీవి వినాయక్ చేతిలో పెట్టాడు. నిజానికి `లూసీఫర్` గొప్ప కథేం కాదు. కానీ స్టైలీష్ మేకింగ్, హీరో పాత్ర ని నడిపించిన విధానం, క్లైమాక్స్ ట్విస్ట్ – ఈ సినిమాని విజయతీరాలవైపు చేర్చింది. చాలా రీమేక్ కథలు ఉన్నది ఉన్నట్టు తీస్తే వర్కవుట్ అవుతాయి. కానీ `లూసీఫర్` అలా కాదు. తెలుగులో తీయాల్సివస్తే చాలా మార్పులు చేయాలి. ముఖ్యంగా సెకండాఫ్ ని వీలైనంత వరకూ మార్చాలి.
ప్రస్తుతం వినాయక్ అదే పనిలో ఉన్నాడు. వినాయక్, ఆకుల శివ అండ్ కో… `లూసీఫర్` ద్వితీయార్థం విషయంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇది వరకే `లూసీఫర్` స్క్రిప్టుని చిరంజీవికి వినిపిస్తే.. `సెకండాఫ్‌లో చాలా మార్పులు అవసరం. నేను అనుకున్నట్టు గా లేదు` అన్నారని టాక్. అందుకే ఆ సెకండాఫ్‌ని పూర్తిగా మార్చేసి, కొత్త వెర్షన్ రాసే పనిలో ఉన్నారు. నవంబరులోగా సెకండాఫ్ పూర్తి చేయాలన్నది వినాయక్ లక్ష్యం. దాంతో పాటు ఈ సినిమాలో మరో కథానాయకుడూ కావాలి. మలయాళంలో ఫృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం హీరోని వెదికి పట్టుకోవాలి. అందుకోసం రానా పేరు గట్టిగా వినిపిస్తోంది. మలయాళంలో ఫృథ్వీ రాజ్ పాత్ర నిడివి తక్కువే. అయితే.. తెలుగులో రానా గనుక ఎంట్రీ ఇస్తే, ఆ పాత్ర ప్రాధాన్యం పెంచాలి. సెండాఫ్ పై ఓ క్లారిటీ వస్తే తప్ప, ఆ పాత్ర ఎవరితో చేయించాలన్నది తేలదు. అందుకే.. ముందు స్క్రిప్టు పూర్తి చేసి రావాలని చిరు అల్టిమేట్టం జారీ చేశారని తెలుస్తోంది.