పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నుంచి నవయుగను తప్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవయుగకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ అంశంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగులు ముందుకేసింది. నిపుణుల కమిటీ అక్రమాలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని.. నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా… టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. నిజంగా.. ఆ నివేదికనే ప్రభుత్వం నమ్మితే.. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి కదా..! కానీ పరస్పర అంగీకారం కోసం ప్రయత్నాలెందుకు..?
అక్రమాలపై చర్యలు తీసుకోరా..? కాంట్రాక్టు వదిలేస్తే చాలా..?
పోలవరం ప్రాజెక్టులో.. అంతులేని అక్రమాలు జరిగాయని… వైసీపీ సర్కార్ వాదిస్తూ వచ్చింది. అన్నింటినీ నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి నుంచి విజసాయిరెడ్డి వరకూ అందరిదీ ఒకటే మాట. అందుకే పీటర్ కమిటీ వేశారు. ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా పోలవరం పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ నుంచి విడదీసి నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారని పేర్కొంది. అంచనాలు పెంచడం, 60సి కింద నోటీసులు జారీ చేయడం, వేరే సంస్థలకు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని నిపుణుల కమిటీ తేల్చింది. ఇన్ని తేల్చినప్పుడు… ఈ కారణాలతోనే.. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చినప్పుడు.. కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో.. ఎందుకు వైసీపీ సర్కార్ వెనుకడుగు వేస్తోంది.
పనులు వదిలేస్తే.. తాము వదిలేస్తామనే బేరం నవయుగకు పెట్టారా..?
న్యాయపరమైన వివాదాలు రాకుండా… ఇప్పటి వరకు చేసిన పనలున్నింటికీ చెల్లింపులు చేస్తామని.. పరస్పర అంగీకారంతోనే.. కాంట్రాక్ట్ సంస్థలు పనులు ముగించి వెళ్లాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. పోలవరం పనులు ఎంత జరిగాయో, ఇంకా పెండింగ్ పనులు ఎన్ని, లెక్కవేసే పనిలో పోలవరం ఇంజనీర్లు ఉన్నారు. అన్నీ లెక్కలేసి..నవయుగకు లెక్కలు సెటిల్ చేసే అవకాశం ఉంది. నిజానికి అక్రమాలు జరిగాయని వాదించినప్పుడు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు పనులు ఆపేసి .. కాంట్రాక్టును వదిలేసుకుంటే.. తాము కూడా వదలేస్తామన్నట్లుగా ఆఫర్ ఇవ్వడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
రివర్స్ టెండరింగ్‌కు కేంద్రం ఆమోదించకపోతే..?
2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 16వేల 010 కోట్ల రూపాయలు. ఆ సమయంలో 14 శాతం తక్కువకు టెండర్ ను ట్రాన్స్ ట్రాయ్ దక్కించుకుంది. కానీ పనులు చేయలేకపోయింది. తక్కువ ధరలకు చేయడానికి నవయుగ ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడా సంస్థను బయటకు పంపేశారు. నవయుగను తొలగించడం పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరులశాఖ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ ప్రాజెక్టు కావడంతో ఎటువంటి మార్పులు చేయలన్నా, కొత్తగా టెండర్లు పిలవాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంది.