ఎన్డీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మార్చడానికి బిల్లు తెస్తోంది ప్రభుత్వం. ఈ నిర్ణయం గురించి మంగళవారం బాగా పొద్దుపోయాక అందరికీ తెలిసింది. చాలా మంది ఆశ్చర్యపోలేదు ఎందుకంటే .. ప్రభుత్వాధినేత స్టైలే అంత. ఇంత వరకూ ఎందుకు మార్చలేదని కొంత మంది అనుకున్నారు. కానీ అందరిలోనూ ఒకటే భావన.. ప్రభుత్వం మారితే ఒక్కచోటైనా వైఎస్ఆర్ పేరు కనిపిస్తుందా ? ఇప్పటి వరకూ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయని పార్టీలు.. ఇక ముందు పోటీగా చేయక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారా ? అనే.
స్థాపించింది.. గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్.. అందుకే ఆ పేరు !
హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన ఎన్టీఆర్‌ది. ఆచరణలోకి తెచ్చింది ఎన్టీఆర్. అందుకే ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఆయన పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. అసలు పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.
ఇంత చిల్లర బుద్దితో ఆలోచించి ఉంటే వైఎస్ఆర్ పేరు దేనికైనా కనిపించేదా !?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరవాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి.. చంద్రబాబు విభజిత ఏపీకి ముఖ్యమంత్రులయ్యారు. ఎవరూ పేర్లపై చిల్లర రాజకీయాలు చేయలేదు. అంతకు ముందు వైఎస్సే చేశారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇలా పేర్లపై చిల్లర రాజకీయాలు చేయలేదు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో అనుకుంటే… కడపకు వైఎస్ పేరు ఉండేదా ?. గతంలో ఎక్కడచూసినా ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఒక్క దానికీ మార్చలేదు. ఎందుకంటే..దాని వల్ల రాజకీయంగా కానీ.. ప్రజోపయోగ పరంగా కానీ పైసా ప్రయోజనం ఉండదు. నిజంగా గత ప్రభుత్వంలో ఆలోచించినట్లయితే ఒక్క పేరూ వైఎస్ఆర్ది ఉండదు.
రేపు ప్రభుత్వం మారితే వైఎస్ఆర్ పేర్లు ఎక్కడైనా కనిపిస్తాయా ?
చిల్లర రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ ను ఈ ప్రభుత్వం చూపిస్తోంది. వచ్చే ప్రభుత్వం .. అవి సరి చేస్తున్నామని.. మరింత ఘోరమైన రాజకీయాలు చేస్తుంది. రాజకీయాలంటే అంతే. ఎందుకంటే.. “ఇఫ్ యు బ్యాడ్.. ఐయామ్ యువర్ డాడ్” అని నిరూపించకపోతే రాజకీయాల్లో చేతకాని వాళ్లనుకుంటారు. నిరూపిస్తారు. అప్పుడు వైఎస్ఆర్ జిల్లా ఉండదు.. వైఎస్ భవన్లు ఉండవు.. వైఎస్ వర్శిటీలూ ఉండవు. అలా చేస్తే ప్రజల్లో సెంటిమెంట్ పెరిగి నాకే ఉపయోగం అని అనుకుంటారేమో కానీ.. మీరు చేశారుగా అనే ప్రశ్నే వస్తుంది. ఇలాంటి పిల్ల చేష్టలతో వైఎస్ఆర్ను నష్టం చేయడం.. అగౌరవపర్చడమే కానీ.. రాజకీయ లాభం ఏమీ ఉండదు.
అధికారం శాశ్వతం అనుకుంటే అంత కంటే పిచ్చోళ్లుండరు !
గత మూడున్నరేళ్లుగా ఇవే పిల్ల చేష్టలు. ఉన్మాద చేష్టలు. అధికారం చేతిలో ఉందని ఏదైనా చేయవచ్చన్నట్లుగా… ముందూ వెనుకా చూసుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు. దీని వల్ల రాజకీయ విలువలూ దిగజారిపోయాయి. ప్రతీకారేచ్ఛ పెరిగిపోయింది. ఆ 175 సీట్లు గెల్చుకుంటున్నాం.. ప్రతిపక్షమే ఉండదు.. మాకు అడ్డేంది అని విర్రవీగుతున్నారు చాలా మంది.. నిజానికి అది అధికారం నెత్తి కళ్లు కనిపించని అహంకారం. అలాంటి అహంకారాన్ని ఇట్టే అణిచి వేస్తుంది ప్రజాస్వామ్యం. అప్పటికీ కాని అసలు విషయం అర్థం కాదు.