ఫిరాయింపు నేతల్లో ఓ నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచి, రాజీనామా చేయకుండా మంత్రి పదవుల్లో కొనసాగేందుకు అనర్హులు అంటూ దాఖలైన పిటీషన్ పై కోర్టు స్పందించి, ఏపీకి చెందిన నలుగురు జంప్ జిలానీ మంత్రులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయమని కూడా ఆదేశించింది. అయితే, ఈ నోటీసులపై ఏపీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు స్పందించారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనతోపాటు మరో ముగ్గురు ఫిరాయింపు నేతలకూ సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టెబెట్టారు. అయితే, ఫిరాయింపులపై తనకు నోటీసు అందిన తరువాత అన్ని విషయాలూ మాట్లాడతానని మంత్రి అంటున్నారు. తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందనే అంశంపై సరైన సమయంలో సవివరంగా చెబుతానని కూడా చెప్పారు.
ఇదే సందర్భంలో టీడీపీలో తాను చేరడాన్ని సమర్థించుకున్నారు! గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, ఆ తరువాత వైసీపీకి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను రాజీనామా చేశానని, కానీ ఆనాడు దాన్ని ఆమోదించలేదని బొబ్బిలి రాజావారు చెప్పారు. ఇప్పుడు, తాను మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రశ్నించడమేంటంటూ అభిప్రాయపడ్డారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఉంటాననీ, నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననీ అన్నారు. తాను పార్టీ మారిన విషయాన్ని కూడా ఇలా నైతిక కోణం నుంచే చూడాలని చెప్పారు!
మంత్రి సుజయ కృష్ణ వాదన ఎలా ఉందంటే… అప్పుడెప్పుడో కాంగ్రెస్ లో ఉండగా వైసీపీకి వెళ్లినప్పుడు రాజీనామా చేసినా అంగీకరించలేదు కాబట్టి, ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా వైకాపాకి రాజీనామా చేయను అని చెబుతున్నట్టుగా వినిపిస్తోంది. ఫిరాయింపుల్ని నైతిక కోణం నుంచీ చూడాలని విజ్ఞప్తి చేయడం విడ్డూరం! పార్టీ మార్పులో నైతికత ఏది..? వైసీపీ టిక్కెట్ పై గెలిచి, తరువాత టీడీపీలోకి జంప్ చేయడంలో నైతికత అనేది ఎక్కడుంది..? ప్రజా తీర్పును కించపరుచుతూ, వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసి పార్టీ మారడంలో నైతికత అనే కోణం ఎక్కడుటుంది..? నిజంగానే, నైతిక లాంటివి ఏవైనా ఉంటే.. రాజీనామా చేసి మాట్లాడాలి! అంతేగానీ, తాను ఇప్పుడు మంత్రిని అయ్యాను కాబట్టి, ఇప్పుడు ప్రశ్నించడం నైతిక కాదన్నట్టుగా ఉంది రంగారావు వాదన. ఆయన పార్టీ మారడం వెనక సవాలక్ష కారణాలు ఉండొచ్చు. మారొద్దనీ లేదా మారకూడదనీ ఎవ్వరూ చెప్పరు. కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత టీడీపీలోకి వెళ్లుంటే.. నైతిక విలువల గురించి ఎన్ని మాట్లాడినా వినేవారికి కాస్త బాగుంటుంది..!