పరిశ్రమలోని ఓ బడా హీరో ఓ చిన్న సైజు హీరోతో నిర్మాతగా సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమాపై కచ్చితంగా ఎంతో కొంత ఫోకస్ ఉంటుంది. బలమైన కంటెంట్ ఏదో ఉండి ఉంటుందిలే అనే ఓ నమ్మకం కలుగుతుంది. ఆ ఫోకస్, నమ్మకం… `ఛాంగురే బంగారు రాజా`పై కూడా పడ్డాయి. కారణం.. ఈ సినిమాకి నిర్మాత రవితేజ కావడమే! `కేరాఫ్ కంచరపాలెం`తో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకొన్న కార్తీక్ రత్నం హీరోగా మారడం, రవితేజ బ్యానర్లో సినిమా చేయడంతో.. ఈ సినిమాపై ఎన్నొ కొన్ని అశలు చిగురించాయి. మరి.. ఆ అంచనాల్ని ఈ రాజా నిలబెట్టుకొన్నాడా? మాస్ మహారాజా నిర్మాతగా చేసిన ప్రయత్నం ఫలించిందా?
బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఓ మెకానిక్. తండ్రి పొగొట్టుకొన్న ఆస్తిని, పొలాల్ని మళ్లీ దక్కించుకోవాలన్నది తన లక్ష్యం. ఊర్లో తనకు మూడెకరాలు ఉంటుంది. దాన్ని 30 ఎకరాలు చేద్దామనే ప్రయత్నాల్లో ఉంటాడు. డబ్బుల విషయంలో ఎవరి దగ్గరా మొహమాట పడడు. వానొస్తే ఊర్లో రంగురాళ్లు దొరుకుతుంటాయి. ఎప్పటికైనా ఓ ఖరీదైన రాయి చేజిక్కించుకొని కోటీశ్వరుడు అవ్వాలని కల కంటుంటాడు. కాకపోతే ఊర్లో అందరూ తనకు శత్రువులే. అనుకోకుండా ఓ మర్డర్ కేసు తనపై పడుతుంది. సాక్ష్యాలన్నీ తనకు వ్యతిరేకంగా మారతాయి. ఈ కేసు నుంచి తనని తాను బయటపడేసుకోవడానికి స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. మరి ఈ ప్రయాణంలో తనకు తెలిసిన నిజాలేంటి? ఈ మర్డర్ ఎవరు చేశారు? ఇంతకీ బంగార్రాజు దోషా? నిర్దోషా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
ఓ మర్డర్ మిస్టరీకి, రంగురాళ్ల నేపథ్యం జోడించి తీసిన సినిమా ఇది. జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కోణాలుంటాయి. ఎవరి కోణంలోంచి వాళ్లు ఆ సంఘటనని చూస్తుంటారు. కానీ నిజం అనేది మరోటి ఉంటుంది. అంటూ… ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు. ఓ మర్డర్ ని మూడు కోణాల్లోంచి చెప్పుకొచ్చి.. అసలు నిజమేంటో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ కథని మొదలెట్టిన విధానం చూస్తుంటే మణిరత్నం `యువ` సినిమా గుర్తొస్తుంది. అందులోనూ అంతే. ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్ని ముగ్గురు వ్యక్తుల కోణం నుంచి చెప్పుకొంటూ వెళ్తాడు దర్శకుడు. ఇక్కడా అదే జరిగింది. అయితే ఆలోచన వరకూ మణిరత్నంని ఫాలో అయిన దర్శకుడు.. దాన్ని ఆచరణలో పెట్టిన విధానంలో మాత్రం ఆయనకు కొన్ని వందల మైళ్ల దూరంలోనే ఉండిపోయాడు.
ఓ కుక్క కోణంలోంచి కూడా ఈ కథ చెప్పాడు దర్శకుడు. నిజానికి తన ఆలోచన కొత్తదే కావొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా ఇదో కొత్త తరహా ఎత్తుగడ అనుకోవొచ్చు. కానీ ఆ ఎపిసోడ్ వల్ల ఈ కథకు ఒనగూరిందేం లేదు. అనవసరమైన కాలయాపన తప్పితే. క్రైమ్ కామెడీ సస్పెన్స్.. ఇలా మూడింటినీ ఒకే ఫ్రేములో ఇరికించే కథని పట్టుకొన్నా – ఈ ఎలిమెంట్స్‌ని ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. క్రైమ్ సీన్ వల్ల ఉత్కంఠత ఏమీ కలగదు. ఆ ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంటుంది. కామెడీ సీన్లు వచ్చినప్పుడు ప్రేక్షకులు విశాల దృక్పథం చూపించి నవ్వాలి కానీ, తెరపై అంత వినోదం ఏమీ పండదు. మధ్యలో దొంగ – మంగ అంటూ లవ్ ట్రాక్ కూడా నీరసంగా నడుస్తుంటుంది. పాటలకు స్కోప్ తక్కువ. ఉన్న ఒక్క పాటలో కూడా.. హీరో రవితేజని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. పాపం.. నిర్మాత రవితేజని ఇలాగైనా ఇంప్రెస్ చేయాలనేమో.?
రవిబాబు వచ్చాక… సినిమా పూర్తిగా అవుడ్డేటెడ్ లుక్‌లోకి వచ్చేస్తుంది. అదే పాత ఎక్స్ప్రెషన్లు, అదే రోత కామెడీతో… రవిబాబు బాగా విసిగించేస్తాడు. ఈ మర్డర్ కమెడియన్ సత్య చేశాడా? అనే కోణంలోంచి 20 నిమిషాలు కథ నడుస్తుంది. కామెడీ ఫేస్ కట్ ఉన్న సత్య మర్డర్ చేయనే చేయడు… అని ప్రేక్షకులకూ తెలుసు. ఆ విషయాన్ని మళ్లీ ప్రేక్షకులకే చెప్పడానికి దర్శకుడు 20 నిమిషాలు తినేశాడంటే… ఏమనుకోవాలి. ఎప్పుడో సినిమా మొదలైనప్పుడు ఎత్తుకొన్న రంగురాళ్ల కాన్సెప్ట్… మళ్లీ క్లైమాక్స్ వరకూ గుర్తుకురాదు. ఎలాగూ కథ అక్కడే మొదలెట్టాం కాబట్టి, అక్కడే ముగించాలన్న ఉద్దేశంతో దర్శకుడు.. మళ్లీ రంగురాళ్ల దగ్గరే కథకు ముగింపు పలికాడు.
కార్తీక్ రత్నం చూడ్డానికి బాగున్నాడు. తన నటన ఓకే. కానీ.. సినిమా మొత్తాన్ని మోసేంత స్టామినా తనకు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. గోల్డీ నిస్సికి స్లో మోషన్లు, ఆ ఖరీదైన కాస్ట్యూమ్స్ (అది కూడా పాటల్లో) ఇవ్వకపోతే.. ఆమె హీరోయిన్ అని గుర్తించడం చాలా కష్టం. తన నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాస్తో కూస్తో ఈ సినిమాలో ఓపిగ్గా చూడగలిగిన పాత్ర, భరించిన పాత్ర ఏదైనా ఉంటే అది సత్యదే. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా రొటీన్ నటనే ప్రదర్శించాడు. మిగిలినవాళ్లంతా నామ్ కే వాస్తే. టెక్నికల్ గా ఈ సినిమా పెద్ద గొప్పగా ఏం లేదు. ఓ ఊరి చుట్టూ నడిచే కథ ఇది. సినిమా మొత్తం అక్కడక్కడే తిరిగేసిన ఫీలింగ్ వస్తుంది. పాటలకు స్కోప్ లేదు. ఉన్న ఒక్క పాటా సో..సోగానే ఉంది.