షర్మిల ఇటీవల స్థాపించిన పార్టీ, ఎలక్ట్రానిక్ మీడియా లో కొన్ని చానల్స్ కు కల్పవృక్షంగా మారిందా? తన పార్టీ కార్యక్రమాలను కవర్ చేయడానికి మీడియాకు షర్మిల డబ్బులు ఒక రేంజ్ లో వెదజల్లుతోందా? ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే..
షర్మిల పార్టీ పై ఎవరికీ అంచనాలు లేవు:
వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించారు. ఆవిడ కి జగన్ తో పొరపొచ్చాలు రావడం వల్ల పార్టీ పెట్టారని కొందరు, తమకు పడని మైనార్టీ ఓట్లు కేసీఆర్ కి గంపగుత్తగా పడకుండా చీల్చడానికి బిజెపి ఆమెతో పార్టీ పెట్టించిందని, దీనికి జగన్ కూడా మద్దతు పలికారని మరికొందరు, అబ్బే అదేమీ కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కెసిఆరే పార్టీ పెట్టించారని ఇంకొందరు రకరకాలుగా అభిప్రాయపడుతున్నప్పటికీ, తెలంగాణలో ఆమె పార్టీ ఏదో అద్భుతాలు సాధిస్తుందన్న అభిప్రాయం మాత్రం ఎవరు వ్యక్తం చేయడం లేదు. అయినప్పటికీ షర్మిల పార్టీ లాంచ్ కి, షర్మిల పార్టీ కార్యక్రమాలకి కొన్ని చానల్స్ విపరీతంగా కవరేజ్ ఇవ్వడం వీక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియా, మీడియా- ఎక్కడ కవరేజ్ రావాలన్నా డబ్బులు వెదజల్లాల్సిందే
ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి అన్న అంశం పై ఎవరికి భేదాభిప్రాయం లేదు. భారత దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీని స్థాపించిన అనేక మంది నాయకులు, డబ్బులు లేకుండా పార్టీ ని నడవడం ఎంతో కష్టం అని పలు మార్లు వ్యాఖ్యలు చేసి ఉన్నారు. గొప్ప ఆశయాలతో పార్టీలు పెట్టిన కొందరు నాయకులు కేవలం ఆర్థిక బలం లేక ఆ తర్వాతి కాలంలో పార్టీలు మూసివేశారు. పార్టీ నడపడానికి డబ్బులు కావాల్సి రావడం ఒక ఎత్తయితే, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అంతకు మించి డబ్బు కావాలి రావడం ఇంకొక ఎత్తు.
మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో మీ ఇంటర్వ్యూ రావాలంటే కొన్ని లక్షలు వారికి సమర్పించుకుంటే సరిపోతుంది. కొన్ని టీవీ చానల్స్ లో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను రోజూ డిబేట్ కి పిలవాలంటే, ఆ చానల్స్ కి పార్టీ తరపున నెల నెలా కొంత ఫండ్ ఇవ్వవలసి ఉంటుంది. వినడానికి కఠోరంగా ఉన్నా, కొన్ని చానల్స్ విషయంలో ప్రస్తుతం ఇది కఠిన వాస్తవం. ఇక మరికొన్ని చానల్స్‌లో సాయంత్రం 7 నుండి రాత్రి 10 వరకు మూడు గంటల ప్రైమ్ టైం స్లాట్ ని కొందరు నాయకులు వారి పార్టీ కోసం కొనుక్కుని అట్టి పెట్టుకున్నారు. దీనర్థం ఆ సమయంలో వచ్చే డిబేట్ లో కానీ వార్తల్లో కానీ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క అంశం చర్చకు రాకూడదు. అఫ్ కోర్స్ చానల్స్ కూడా కొంచెం తెలివి మీరి పోయి, అవతలి పార్టీల వార్తలను ఆ ప్రైమ్ టైం కు ముందో వెనకాలో ప్రసారం చేసి అవతలి పార్టీల మెప్పును కూడా పొందుతున్నాయి. సొంత ఛానల్ , సొంత పేపర్ లేకుండా పార్టీని నడపటం దాదాపు అసాధ్యం అన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి.
జనసేన టీజేఎస్ పార్టీల కి వచ్చిన కవరేజ్ కి వందల రెట్ల ఎక్కువ కవరేజ్ పొందిన షర్మిల పార్టీ
ఆ మధ్య జనసేన పార్టీ రాజమండ్రిలో ఒక కవాతు నిర్వహిస్తే దానికి 5 లక్షల మంది పైగా హాజరైతే అనేక చానల్స్ లో కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండ రామిరెడ్డి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన చిన్నపాటి స్క్రోలింగ్ కూడా అనేక చానల్స్‌లో ఏమాత్రం కనిపించదు. తీన్మార్ మల్లన్న అనే స్వతంత్ర అభ్యర్థి ఒక ఉపఎన్నిక లో బిజెపి ,కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు సాధించినా ఆయన గురించి అనేక చానల్స్ రెండు వాక్యాలు కూడా మాట్లాడవు. కానీ షర్మిల పార్టీ పట్ల తెలంగాణ ప్రజలలో అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ కొన్ని చానల్స్ ఆమె పార్టీని తమ భుజాలమీద మోస్తున్నట్లు గా కనిపిస్తోంది. లాంచ్ అవడానికి ముందు, లాంచ్ రోజు, ఆ తర్వాత పుంఖానుపుంఖాలుగాను కథనాలు ప్రసారం చేయడానికి ఆ చానల్స్ ఉత్సాహపడి పోయాయి.
ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్ కి కల్పవృక్షం లా షర్మిల పార్టీ మారిందా?
నిజానికి తెలుగు న్యూస్ చానల్స్ కి ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పోలిస్తే టిఆర్పి రేటింగ్ 10% కూడా ఉండవు. ఈ కారణంగానే అధికార పార్టీ లకు అడుగులకు మడుగులొత్తే కొన్ని చానల్స్ తప్ప మిగతా అనేక చానల్స్ నష్టాల బాటలోనే నడుస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన షర్మిల, పార్టీ లాంచ్ చేయడం వారికి కల్పవృక్షం లా కనిపిస్తోంది. ఎవరికి వారు షర్మిల పార్టీకి తాము ఏ విధంగా కవరేజ్ ఇవ్వాలనుకుంటున్నదీ, దానికి పార్టీ నుండి తాము ఏమి కోరుతున్నదీ స్పష్టమైన ఎజెండా తయారుచేసుకుని పార్టీని అప్రోచ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల కి సైతం, మీడియా కవరేజ్ రాక పోతే పార్టీకి ఏ గతి పడుతుందో అవగాహన ఉండడం వల్ల మీడియాకు డబ్బులు వెదజల్లే విషయంలో తటపటాయింపు ఏమీ లేనట్లు కనిపిస్తోంది.
ఆశ్చర్యకరంగా, జనసేన పార్టీని నోవాటెల్ లో లాంచ్ చేసినప్పుడు పార్టీ లాంచ్ కోసం నిధులు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆ పార్టీని ప్రశ్నించిన అనేక చానల్స్, షర్మిల జూబ్లీహిల్స్ లోని ఒక కన్వెన్షన్ హాల్ నుండి పార్టీని లాంచ్ చేసినప్పుడు అటువంటి ప్రశ్నలు ఏ మాత్రం వేయలేదు. ఇతర పార్టీలు లాంచ్ అయిన మర్నాటి నుండే వాటి మీద బురద చల్లే కార్యక్రమాలు చేసే అనేక చానల్స్, షర్మిల పార్టీ పై మాత్రం పాజిటివ్ కథనాలు వేయడానికి పోటీ పడ్డాయి.
ఏది ఏమైనా, ఓట్లు వేయడానికి పార్టీ లు డబ్బు పంచుతాయి కాబట్టి తరచూ ఏదో ఒక ఎన్నిక వస్తే బాగుండు అని కొందరు ఓటర్లు భావించినట్లే , బాగా అర్థ బలం ఉన్న షర్మిల లాంటివారు ఎంత ఎక్కువ మంది రాజకీయ పార్టీలు పెడితే అంత బాగుండు అని కొన్ని చానల్స్ కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి షర్మిల పార్టీ కొన్ని టీవీ చానల్స్ కి వరంగా మారింది అన్న చర్చ మాత్రం మీడియా వర్గాల్లో కొనసాగుతోంది.