టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ లైవ్ లో ప్రత్యక్షమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి, తన మీద కేసులు నమోదయ్యాయని, తన ఇంట్లో సోదాలు జరిగాయని, రవి ప్రకాష్ పరారీలో ఉన్నాడని వస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
రెండు రోజుల నుంచి తాను పరారీలో ఉన్నానని కొన్ని చానల్స్ లో వచ్చిన వార్తలు అవాస్తవమని, మొన్న రాత్రి 9 గంటలకు టీవీ9 లో లైవ్ కార్యక్రమంలో ఉన్నానని, అది ప్రేక్షకులంతా చూశారని, కేవలం నిన్న వేరే ఊరు ప్రయాణం చేయాల్సి రావడం వల్ల టీవీ9 ఆఫీసులో లేనని, ఇక ఈ రోజు ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యం అయిందని, ఈ మాత్రానికే తోటి చానల్స్ తాను పరారీలో ఉన్నాడని రాశారని, అలా రాసిన చానళ్లకు తన ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.
అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక కేసు ఉన్న మాట వాస్తవమేనని, ఆ కేసు ఈనెల 16వ తేదీన విచారణ కు రానుందని, అయితే ఆ కేసును ఆధారంగా చేసుకుని కొంతమంది తప్పుడు వార్తలు ప్రసారం చేశారని రవిప్రకాష్ వ్యాఖ్యానించారు. తనను పోలీసులు ఎవరు అరెస్టు చేయలేదని, చేయబోవడం కూడా లేదని రవి ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని రవి ప్రకాష్ వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా టీవీ9 నంబర్ వన్ స్థానంలో ఉందని, ఉదయం నుంచి తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానల్ లు, నిజమైన వార్తలు ప్రసారం చేసి ఉంటే వారి క్రెడిబిలిటీ కూడా పెరిగి ఉండేదని, డబ్బు కోసం వారు అబద్ధపు వార్తలు ప్రచారం చేయకుండా ఉంటే వారి విశ్వసనీయత పెరిగి ఉండేదని, అప్పుడు వారి చానల్స్ కూడా టాప్ పొజిషన్ లో ఉండేవని ఆ చానల్స్ కు చురకలంటించారు. అలాగే, తనను సీఈవో స్థానం నుంచి తొలగించారు అన్న వ్యాఖ్యలను ఖండించే లాగా, ” నేను ఇప్పుడు టీవీ9 సీఈవో గా మాట్లాడుతున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.
ఏది ఏమైనా, రవి ప్రకాష్ కూడా యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గా తెరపై ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అనిపిస్తోంది. అయితే “చానళ్లు బాధ్యతగా వ్యవహరించాలి” అన్న వ్యాఖ్య మాత్రం టీవీ9 కూడా వర్తిస్తుంది కదా అంటూ చూసిన జనాలు చర్చించుకుంటున్నారు.