ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న తనను కలిసిన తెదేపా ఎంపీలతో మాట్లాడుతూ, “రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెపుతోందని అందుకే ఇవ్వలేకపోతున్నామని” అన్నారు. ప్రత్యేక హోదాకి బదులు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, పరిశ్రమలకు రాయితీలు మంజూరు చేయాలనుకొంటున్నట్లు తెలియజేసారు. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల ఆదుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. కానీ దానితో వారు సంతృప్తి చెందలేదు. అరుణ్ జైట్లీ చెప్పిన ఈ విషయాలను వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేయడంతో ఆయన విజయవాడలో తన క్యాంప్ కార్యాలయంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, పరకాల ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులతో సమావేశమయ్యి దీనిపై చర్చించిన తరువాత కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాద్ సింగ్ మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కొంచెం గట్టిగానే మాట్లాడినట్లు సమాచారం. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల గురించి, మునికోటి బలిదానం గురించి వారికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి తాము, రాష్ట్ర బీజేపీ నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా వారికి వివరించి, ఇంకా ఈ విషయంలో నాన్చినట్లయితే ఇరు పార్టీలపై ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుందని ఆయన వారికి వివరించినట్లు తెలుస్తోంది.ఇంతవరకు మిత్రధర్మం పాటిస్తూ కేంద్రంతో సున్నితంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కొంచెం గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్పందిస్తూ త్వరలోనే డిల్లీలో సమావేశమయ్యి దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకొందామని ఆయనకి నచ్చజెప్పి శాంతింపజేసినట్లు తెలుస్తోంది.