హైదరాబాద్: చిరంజీవి స్వయంగా రెసిపీ కనుగొని ఆవిష్కరించిన స్పెషల్ దోశె హైదరాబాద్‌లో కొన్ని హోటళ్ళలోకూడా అదే పేరుతో వడ్డించబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాంచరణ్ ఆ దోశెకు పేటెంట్ హక్కులు తీసుకోబోతున్నారట. ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చరణ్ ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేటెంట్ హక్కులను తన తండ్రి 60వ జన్మదిన కానుకగా ఇస్తానని అన్నారు.
సాధారణంగా దేశె అంటే పలచగా ఉంటుంది. కానీ ఏమాత్రం నూనె వాడకుండా మందంగా చిరంజీవి దోశెను తయారు చేస్తారు. దీనిలో నంచుకోటానికి కూరగాయలతో చేసిన కూటును, వేరుశెనగపప్పుల పచ్చడిని పెడతారు. 25 ఏళ్ళక్రితం ఒకసారి మైసూర్‌కు షూటింగ్‌కు వెళ్ళినపుడు కాఫీ తాగటానికి ఒక చిన్న ఢాబా దగ్గర చిరంజీవి ఆగారట. అక్కడ 2-3 టేబుల్స్ మాత్రమే ఉన్నాయట. అక్కడ వడ్డిస్తున్న ఒక దోశను చిరంజీవి రుచి చూశారట. అది అద్భుతంగా అనిపించిందట. ఎలా తయారుచేస్తారని అడగగా, ఆ ఢాబా నడిపే వ్యక్తి – ఎన్నికావాలంటే అన్నిదోశెలు ప్యాక్ చేసి ఇస్తానుగానీ రెసిపీ చెప్పనని చెప్పాడట. దీంతో చిరంజీవి తన ఇంట్లోని వంటమనిషిని మైసూర్ పిలిచి ఆ దోశె రుచి చూసి రెసిపీ కనుక్కోమని ఆదేశించారట. దాదాపు ఒక సంవత్సరంపాటు ఆ దోశె తయారుచేయటానికి చిరంజీవి ఇంట్లో ప్రయోగాలు చేసినా ఉపయోగం లేకపోయిందట. అయితే ఈ క్రమంలో ఒక రుచికరమైన కొత్త దోశెను కనుక్కొన్నారట. అదే చిరంజీవి దోశె.
చిరంజీవి ఇంటికి వచ్చిన రజనీకాంత్, సచిన్, రిచర్డ్ గేర్వంటి ప్రముఖ అతిథులకు ఈ దోశె అంటే ఎంతో ఇష్టమట. మొన్న పార్క్ హయత్ హోటల్లో ఈ దోశెనుకూడా అతిథులకు వడ్డించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ దోశెను వాణిజ్యపరంగా అమ్మటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చరణ్ చెప్పారు. దీనిని తక్కువ ధరకే అందిస్తానని, తద్వారా ఎక్కువమంది తినటానికి వీలవుతుందని చరణ్ అన్నారు.