మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఎంత ప్రయత్నించినా తన చేతికి అంటిన బొగ్గు మసిని వదిలించుకోలేకపోతున్నట్లున్నారు. బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల కుంభకోణంలో మళ్ళీ ఆయన పేరును కూడా చార్జ్ షీటులో చేర్చాలని సిబీఐ కోర్టు ఆదేశింది. ఆయనతో బాటు సౌభాగ్య ఎండి కె రామకృష్ణ ప్రసాద్, జ్ఞానస్వరూప్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, కాంగ్రెస్ పార్టీ ఎంపి నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తదితరులు మొత్తం 13 మంది పేర్లను చార్జ్ షీట్లో చేర్చాలని సిబిఐ కోర్టు శుక్రవారం సి.బి.ఐ.కి ఆదేశాలు జారీ చేసింది.
ఇదివరకు దాసరికి సిబీఐ కోర్టు ఈ కేసులో సమన్లు జారీ చేసినప్పుడు, ఆయన ఈ కేసుతో తనకు సంబంధం లేదని వాదించారు. తాను బొగ్గు శాఖకు కేవలం సహాయ మంత్రిగా మాత్రమే పని చేసినందున, తన స్థాయిలో బొగ్గు గనుల కేటాయింపులపై ఎటువంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం తనకు లేదని, ఆనాటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఇటువంటి వ్యవహారాలలో తుది నిర్ణయాలు తీసుకొనేవారని వాదించారు. ఈ కుంభకోణంలో తను కానీ తనకు చెందిన సౌభాగ్య మీడియా సంస్థకి గానీ ఎటువంటి ఆర్ధిక లాభం పొందలేదని వాదించారు. కానీ సిబీఐ కోర్టు ఆయన వాదనలతో ఏకీభవించినట్లు లేదు. అందుకే చార్జ్ షీట్లో ఆయన పేరును కూడా చేర్చమని ఆదేశించింది.