మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్, మరో నలుగురిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ శుక్రవారం 2జి కుంభకోణంపై విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయన కుటుంబీకులకు చెందిన సంస్థలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డాయని ప్రధాన ఆరోపణ. మారిషస్ కి చెందిన కొన్ని సంస్థలు దయానిధి మారన్ కుటుంబ సభ్యులకు చెందిన ఎస్.డి.టి.పి.ఎల్. మరియు ఎస్.ఏ.ఎఫ్.ఎల్. సంస్థలలోకి అక్రమంగా రూ.742.58 కోట్లు బదిలీ చేశాయని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఐ.పిసి.సెక్షన్స్ 120 బి రెడ్ విత్ సెక్షన్స్ మరియు 7,12 రెడ్ విత్ సెక్షన్స్ 13(2) క్రింద కేసుల్లు నమోదు చేసారు. ఈ చార్జ్ షీట్ ని విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు సేకరించిన అన్ని సాక్ష్యాధారాలు, పత్రాలు కోర్టుకు సమర్పించమని ఆదేశించింది.
ఈడీ అధికారులు ఇంతవరకు దయానిధి మారన్, కళానిధి మారన్, కావేరి మారన్ మరియు వారి కుటుంబ సభ్యులకు చెందిన వివిధ సంస్థలకి చెందిన రూ. 742.55కోట్ల విలువ గల ఫిక్సెడ్ డిపాజిట్లు, మ్యూట్యువల్ ఫండ్స్, షేర్లు, భూములు, భవనాలను స్వాధీనం (అటాచ్) చేసుకొన్నారు. మారన్ సోదరులు తాము ఎటువంటి అక్రమాలకూ, అవినీతికి పాల్పడలేదని వాదిస్తున్నారు. తమ సంస్థలన్నీ చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తున్నాయని అయినా తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.