దేశానికి తీరని అప్రదిష్ట తెచ్చిన దాద్రీ హత్య కేసులో పోలీసులు నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసారు. సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని దాద్రి అనే గ్రామంలో 52 ఏళ్ల వయసు గల మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో కొందరు దుండగులు అతనిని ఇంటిలో నుంచి బయటకు లాక్కొని వచ్చి అందరూ చూస్తుండగానే బహిరంగంగా కొట్టి చంపారు. దానిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువెత్తాయి. మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. బిహార్ శాసనసభ ఎన్నికలలో బీజేపి ఓటమికి అది కూడా ఒక కారణమయింది. దేశంలో మత అసహనం పెరిగిపోతోందని ప్రచారం చేయడానికి ఆ సంఘటనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది.
ఈ సంఘటన జరిగిన మూడు నెలల తరువాత నొయిడా పోలీసులు నిన్న గౌతంబుద్ధ నగర్ కోర్టులో మొత్తం 15 మంది మీద చార్జి షీట్ దాఖలు చేసారు. ఈ కేసుతో సంబంధం ఉన్న భీమ, పునీత్ అనే మరో ఇద్దరిని నిన్ననే అరెస్ట్ చేసారు. వారిపై కూడా త్వరలోనే అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాగ్ సింగ్ తెలిపారు. ఇంకా సచిన్, పునీత్ అనే మరో ఇద్దరు విద్యార్ధులు పరారిలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన వారిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. అతనిని బాల నేరస్తుల బోర్డుకి అప్పగిస్తామని తెలిపారు. మిగిలిన 18 మందిలో ఒకడు బీజేపీ నేత సంజయ్ రాణా కుమారుడు విశాల్ కూడా ఉన్నాడు.
పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీటులో ఎక్కడా ‘బీఫ్’ అనే పదం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతోనే మొహమ్మద్ అఖ్లాక్ ని వారు హత్య చేసినప్పుడు, హత్యకు కారణాన్ని పోలీసులు తమ చార్జ్ షీటులో పేర్కొనకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఆ దుండగుల చేతిలో హత్యకాబడిన మొహమ్మద్ అఖ్లాక్ పెద్ద కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. ఈ సంఘటన జరిగిన తరువాత మొహమ్మద్ అఖ్లాక్ కుటుంబ సభ్యులు దాద్రీలో ఉండటానికి భయపడి చెన్నైలో ఉంటున్న ఆయన దగ్గరకు వెళ్ళిపోయారు. మూడు నెలల తరువాత నిన్న చార్జ్ షీట్ దాఖలయింది. ఇంక కోర్టులో ఈ కేసు ఎన్ని ఏళ్ళు సాగుతుందో చూడాలి.