కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న పాదయాత్ర నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుమతులు లేవని డీజీపీ సాంబశివ రావు ఇదివరకే చెప్పారు. ఇదే అంశమై విజయవాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మళ్లీ మాట్లాడారు. నాటి తుని ఘటనను గుర్తు చేస్తూ, కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు ఆయన మాట్లాడటం గమనార్హం! శాంతిభద్రతలు పరిరక్షించేందుకే నియమ నిబంధనల్ని పెడతామనీ, వాటిని ఉల్లఘించేవారిని చూస్తూ ఊరుకోమని డీజీపీ హెచ్చరించారు. త్వరలోనే ముద్రగడ చేపడతామంటున్న యాత్రకు అనుమతుల్లేవని, ఆయన పర్మిషన్ కోరలేదన్నారు. కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వ పరిధిలో కసరత్తు జరుగుతోందని డీజీపీ చెప్పారు. ఈ విషయమై కాపు సోదరులు కాస్త ఓపిగ్గా ఉండాలనీ, ఉద్యమాల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రోడ్లపైకి రావొద్దని కోరారు.
ఏడాదిన్నర కిందట అనుమతుల్లేకుండా ఉద్యమం చేసినప్పుడు తాము అడ్డుకోలేదనీ, దాంతో తునిలో విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అనుమతి ఇవ్వలేమన్నారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై దాడి చెయ్యడం, రైళ్లపై రాళ్లు రువ్వడం, రైలు బోగీలకు నిప్పుపెట్టడం, మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం.. ఇలాంటి గతానుభవాలను దృష్టిలో ఉంచుకునే తాము అనుమతి ఇవ్వడం లేదనీ, అంతేతప్ప కాపులకు వ్యతిరేకం కాదని డీజీపీ చెప్పుకొచ్చారు. నాటి తుని ఘటన సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నీ కలిసి రూ. 80 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని లెక్కలు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 336 మందిపై ఛార్జిషీట్స్ సిద్ధమయ్యాయని డీజీపీ చెప్పారు. అయితే, సాంకేతికంగా మరికొన్ని ఆధారాలు వాటికి జతచేయాల్సిన అవసరం ఉండటంతో ఇంకా కోర్టుకు సబ్మిట్ చెయ్యలేదన్నారు. అయితే, మరో వారం రోజుల్లో ఆ పనీ పూర్తవుతుందనీ, కాకినాడ సీఐడీ కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని డీజీపీ చెప్పడం గమనార్హం.
ముద్రగడ ఉద్యమించేందుకు సిద్ధమౌతున్న తరుణంలో తుని ఘటనపై ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని డీజీపీ ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. ఛార్జిషీట్లు పేరుతో కాపు నేతల్ని బెదిరించేందుకే ఇప్పుడీ అంశాన్ని తెరమీదికి తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అనుమతి ఉన్నా లేకపోయినా ఈ నెల 26న ముద్రగడ చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునేందుకు నాటి తుని ఘటన ప్రస్థావనకి తెస్తున్నారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. డీజీపీ చెప్పినట్టు సాంకేతిక కారణాల వల్లనే ఛార్జిషీట్లు దాఖలు ఆలస్యమై ఉండొచ్చు. కానీ, ఇప్పుడు ముద్రగడ మరోసారి ఉద్యమిస్తానంటున్న ఈ తరుణంలో తుని ఘటనపై కదిలక వచ్చిందంటే… ఈ రెంటినీ ప్రజలు రిలేట్ చేసుకుంటారు కదా! పైగా, కాపుల రిజర్వేషన్ల విషయమై సర్కారువారి స్పందన ఏవిధంగా ఉంటోందో గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా! ముద్రగడను అడ్డుకునేందుకు పెట్టిన శ్రద్ధ… ఆ హామీ విషయంలో పెట్టి ఉంటే ఈపాటికి ఒక క్లారిటీ వచ్చేది కదా!