కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది. చేతిలోకి వచ్చిన విజయాలను కూడా అందుకోలేక హర్యానా వంటి రాష్ట్రాల్లో బొక్క బోర్లా పడింది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బాధితురాలిగా ఉండి ప్రజల సానుభూతిని కూడా పొందలేకపోయింది. బీజేపీతో ముఖాముఖి తలపడే ఏ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి ఆందోళన ప్రారంభమయింది. కానీ ఇప్పుడు ఓ అవకాశం వారిని పలకరిస్తోంది. అదే సోనియా, రాహుల్ జైలుకెళ్లడం.
సోనియా, రాహుల్ లను చుట్టుముట్టిన నేషనల్ హెరాల్డ్ కేసు
1930ల్లో నెహ్రూ ప్రారంభించిన ఓ పత్రికను నడిపించిన సంస్థ ఆస్తులు, షేర్ల వివాదం ఇప్పుడు సోనియా, రాహుల్ మెడకు చుట్టేశారు. అందులో ఐదు వేల కోట్ల మనీ లాండరింగ్ అని ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుని ట్రయల్ ప్రారంభించి వారికి నోటీసులు జారీ చేస్తుంది. అది ఈడీ కేసు కాబట్టి తాము తప్పు చేయలేదని వారు నిరూపించుకోవాల్సి ఉంది. ఈ కేసులో జైలు తప్పదని బీజేపీ నేతలు సోనియా, రాహుల్ లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
జైలుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి
సోనియా, రాహుల్ గాంధీలను జైలుకు పంపితే..కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. నేరుగా ప్రజల్లోకి వెళ్లి అభిమానం పొందడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. కనీసం సానుభూతి ద్వారా అయినా వారికి ఓట్లు వేసేలా చేసుకునేందుకు ఓ అవకాశం లభిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎందరో బడా వ్యక్తులు బీజేపీలో చేరి ఈడీ,సీబీఐ కేసుల నుంచి రక్షణ పొందారు. ఇప్పటికీ పొందుతున్నారు. చివరికి పరోక్ష మద్దతు ఇచ్చిన వారికీ ఆ పార్టీ మద్దతు లభిస్తోంది. అరెస్టు చేయకుండా సీబీఐ అధికారుల్ని అడ్డుకున్న వారిని, నేరుగా సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టిన వారిని కూడా రక్షిస్తున్నారు. అందర్నీ వదిలేసి.. అసలు మనీ ట్రాన్సాక్షన్సే లేని.. కేసులో సోనియా, రాహుల్ లను జైలుకు పంపిస్తే ప్రజల్లో చర్చ జరగదా ?. అది వారికి సానుభూతిగా మారదా ?
చట్టాలు అందరికీ సమానం కాదు!
మన దేశంలో చట్టాలు అందరికీ సమానం కాదు. అధికారంలో ఉన్న వారికి.. డబ్బులు ఉన్న వారికి మాత్రం వేరు. వారి చట్టాలు వేరు. ఇంకా చెప్పాలంటే వారు ఎన్ని తప్పులు చేసినా బయటపడవచ్చు. అదే అధికారంలో ఉన్న వారు తమ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టాలనుకుంటే గాల్లో కేసు సృష్టించి పెట్టేస్తాయి. దానికి వ్యవస్థలు కూడా వంత పాడతాయి. కళ్ల ముందు కనిపించేలా ఇలాంటి వ్యవస్థల పనితీరుతో ప్రజలు ఎంత కాలం సహనంగా ఉంటారో కానీ..చట్టాలు మాత్రం సమానంగా అమలు కావడం లేదనే సత్యం వారికి బాగా తెలుసు.