మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ తన కుటుంబసభ్యులతో వలస ప్రయాణంచేస్తూ, సముద్రంలో బోటు మునిగిపోవడంతో ప్రాణాలుకోల్పోయి అలలతాకిడికి టర్కీ సముద్రతీరానికి కొట్టుకువచ్చిన సంఘటన ప్రపంచ మానవతావాదుల్నేకాదు, ఏకంగా ప్రపంచదేశాధినేతలనుకూడా కదిలించింది. అంతర్యుద్ధాలతోనూ, ఉగ్రవాద దాడులతోనూ సిరియా అతలాకుతలమవుతుంటే, సురక్షిత దేశాలకు వెళ్ళి తలదాచుకోవాలన్న ఏకైక తపనతో తరలివెళుతున్న శరణార్థుల కన్నీళ్ల కష్టాలకు పరాకాష్టగా సముద్రతీరానికి కొట్టుకువచ్చిన సిరియా బాలుడి మృతదేహం ఫోటో నిలిచింది. ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో కనిపించగానే ప్రపంచ దేశాల ఆలోచనల్లో మార్పునకు అంకురార్పణపడింది. అయితే, మరో పక్కన ఈ అమాయకపు బాలుడిపై కూడా వికృత కార్టూన్లు వచ్చేసరికి అంతా ఉలిక్కిపడ్డారు.
ఒక ఫ్రెంచ్ సెటైరికల్ మేగజైన్ తన తాజా సంచికలో సిరియా బాలుడిపైనా, సిరియా తీవ్రసంక్షోభంపైనా వెటకారం ధ్వనించే రీతిలో కార్టూన్లు ముద్రించడం ఇప్పుడు వివాదం రేకెత్తింది. సముద్రతీరంలో ఇసుకతెన్నులమీద బోర్లపడిఉన్న సిరియా బాలుడి మృతదేహం మతాతీతంగా అందరి హృదయాలను కదిలిస్తుంటే, ఫ్రెంచ్ మ్యాగజైన్ ఛార్లీ హెబ్డో పత్రికమాత్రం మానవతావాదానికి భిన్నంగా కార్టూన్లు ముద్రించింది. మతపరమైన రాతలతో రెచ్చగొట్టింది.
ఒక కార్టూన్ లో చిన్నారి బీచ్ లో బోర్లాపడిఉన్నట్టు చూపుతూనే, వలసవాదుల్లారా, స్వాగతం అని పేర్కొంటూ
“So close to his goal…” (మీరు లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు)అంటూ వెటకారంగా రాస్తూనే, వెనుకవైపున ఒక హోర్డింగ్ ఉన్నట్టు చూపిస్తూ దానిపై మెక్ డోనాల్డ్ నవ్వుతున్న బొమ్మవేసి – ప్రమోషనల్ ఆఫర్ అన్నట్టుగా- కిడ్స్ మెనూ ఇది అని పేర్కొంటూ
“Two children’s menus for the price of one.” అంటూ ఫ్రెంచ్ భాషలో రాయడం చూస్తుంటే వెటకారం పాలు హెచ్చుగానే ఉన్నట్టు ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, అదే సంచికలోని మరో కార్టూన్ లో సముద్రపు ఒడ్డున జేసెస్ క్రీస్ట్ లాంటి వ్యక్తి నిలబడిఉన్నట్టు చూపారు. మూడేళ్ల పిల్లాడి తలకాయ ఇసుకలో కూరుకుపోయిఉంటే, కాళ్లుమాత్రం పైకి లేచిఉన్నట్టు బొమ్మవేశారు . దానిపై “Christians walk on water… Muslim kids sink.” అంటూ రాశారు. ఇలా మతపరమైన రెచ్చగొట్టే వెటకారంపై కూడా ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కార్టూన్లను చూసి సభ్యదేశాలు నెవ్వెరపోతున్నాయి. వ్యంగ్య కార్టూన్లు వేయడం మంచిదేకానీ, మానవతావాదాన్ని మంటగలిపే రీతిలోనూ, మతవివక్షతో రెచ్చగొట్టే రీతిలో ఉంటే వాటిని ఖండిచాల్సిందే.పైగా చిన్నారుల హృదయవిదారక మరణాలపై ఇలాంటి వెటకారరాతలు, వ్యంగ్య కార్టూన్లు (గీతలు) ఏమాత్రం క్షమార్హంకావు.
ఛార్లీ హెబ్డో అనే ఈ పత్రిక 1970 నుంచీ వస్తునేఉంది. మొదటి నుంచీ సంచలనాలకు మారుపేరుగా నిలిచింది ఈ ఫ్రెంచి మేగజైన్. 2006లో ఇస్లామ్ మతప్రవక్త మొహ్మద్ పై రాసిన రాతలకు పెనువిమర్శలకు గురైంది. అనేక సందర్భాల్లో ఈ మేగజైన్ ను అనేక దేశాలు బ్యాన్ చేశాయి. ఈ వెటకార కార్టూన్లతోనైనా ఈ పత్రికపై కఠిన చర్యలు తీసుకుంటే సభ్యసమాజం హర్షిస్తుంది.
– కణ్వస