‘జ్యోతి లక్ష్మి’ తరవాత ఛార్మి తెరపై కనిపించలేదు. పూరి కనెక్ట్స్ పేరుతో ఓ సంస్థ స్థాపించి – పూరి జగన్నాథ్ సినిమాలకు చేదోడు వాదోడుగా ఉంటోంది. `ఇస్మార్ట్ శంకర్`కు తాను కూడా ఓ నిర్మాతే. ఇక సినిమాల్లో కనిపించరా? అని అడిగితే ”జ్యోతిలక్ష్మి తరవాత సినిమాలకు దూరమవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నా. పదిహేనేళ్లుగా నటిస్తూనే ఉన్నా. నాకు నటనపై బోర్ కొట్టేసింది. అందుకే కెమెరా ముందుకు రావడం లేదు. జ్యోతిలక్ష్మి తరవాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి కూడా. ఐటెమ్ గీతాలకూ అడుగుతున్నారు. భారీ మొత్తంలో పారితోషికం ఇస్తానన్నారు. కానీ.. నేను డబ్బులకు పడిపోయే రకాన్ని కాదు. ఒక్కసారి వద్దనుకున్నానంటే.. ఆ మాట మీదే ఉంటాను. ఇక నటనకు స్వస్తి పలికినట్టే. ప్రస్తుతం నిర్మాణ రంగంపైనే దృష్టి పెట్టా. ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత కూడా వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటా” అంటోంది.
పూరితో ఈ అనుబంధం ఎలా మొదలైంది? అని అడిగితే.. దానికి సమాధానం చెబుతూ ”పూరి అంటే నాకు ఎనలేని అభిమానం. నా పౌర్ణమి సినిమాతో పాటు పోకిరి కూడా విడుదలైంది. నా సినిమా పక్కన పెట్టి.. పోకిరి సినిమాని మూడు సార్లు చూశా. ఆయన గొప్ప కథకుడు. గొప్ప దర్శకుడు. తప్పకుండా ‘ఇస్మార్ట్ శంకర్’తో తన హవా మరోసారి చూపిస్తారు. ఈసినిమా చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది” అని ధీమాగా చెప్పుకొచ్చింది ఛార్మి. అన్నట్టు శుక్రవారం ఛార్మి పుట్టిన రోజు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ కోసం గోవా వెళ్లింది ఛార్మి. తన పుట్టిన రోజు వేడుకలు కూడా అక్కడే జరుపుకోబోతోంది.