మీ ఇంటికి మావిడాకులు… మీ మెడలో ఎవరొకరు మూడు ముళ్ళు కట్టే రోజు ఎప్పుడు వస్తుందమ్మా? అని ఛార్మిని అడిగితే… విడాకుల గురించి మాట్లాడుతోంది. నేను పెళ్లి చేసుకుంటే విడాకులు తప్పవని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. నాకు పెళ్లి వర్కవుట్ కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. 30 ఏళ్ళు వచ్చిన ప్రతి హీరోయిన్‌కి తప్పకుండా ఎదురయ్యే ప్రశ్నలలో ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అనేది ఒకటి. అందులోనూ నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి, సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన ఛార్మిని ఎవరూ ఈ ప్రశ్న వేయకుండా వుండరు. ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన ఛార్మిని ఇదే ప్రశ్న వేసి వుంటారు. ప్రేమ, పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పారు.
గతంలో సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని ప్రేమించాను కాని వర్కవుట్ కాలేదని ఛార్మి చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “మా నాన్నకు నా గురించి బాగా తెలుసు. ఆయన ఎప్పుడూ నాతో ‘నువ్వు మ్యారేజ్ మెటీరియల్ కాదు’ అని అంటుంటారు. ప్రేమలో వుంటే ఎప్పుడూ ప్రియుడి పక్కనే వుండాలి. అతణ్ని అతిగా గారాబం చేస్తుండాలి. నాకు రెండూ చేతకాదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా… ఇవన్నీ విడాకులకు దారి తీస్తాయి” అని పేర్కొన్నారు. అంతా బాగుంది గాని… గతంలో ఛార్మి ప్రేమించిన ఇండస్ట్రీ పర్సన్ ఎవరో చెప్పలేదు. ఛార్మి ఫాదర్ వెర్షన్ అలాగ వుంటే… మదర్ మాత్రం పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెడుతున్నారట. నేను ఒకర్ని ప్రేమించలేనప్పుడు పెళ్లి ఎలా చేసుకోగలను? అని ప్రశ్నిస్తున్నారామె.