బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతితో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో విడుదల అవ్వడం లేదు. కేవలం హిందీ బెల్ట్ కే పరిమితం. ఈ సినిమాతో.. సాయి శ్రీనివాస్ రేంజ్ బాలీవుడ్ లో ఎలా ఉండబోతోందో తేలిపోనుంది. అయితే… బిజినెస్ పరంగా మాత్రం పెన్ స్టూడియోస్ సంస్థ సంతృప్తికరంగానే ఉంది. ఈ సినిమాకి రూ.45 కోట్ల వరకూ ఖర్చయ్యింది. మరో రూ.5 కోట్లు వడ్డీలు, పబ్లిసిటీ వేసుకొన్నా.. రూ.50 కోట్లయినట్టు లెక్క. ఇవన్నీ నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో వచ్చేశాయి. జీ స్టూడియోస్ సంస్థ ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని కొనేసింది. అందుకు గానూ రూ.50 కోట్లు ముట్టజెప్పింది. సాయి శ్రీనివాస్‌కి… హిందీలో మంచి మార్కెట్ ఉంది. తన తెలుగు డబ్బింగులే రూ.20 కోట్ల వరకూ అమ్ముడుపోతాయి. ఇది హిందీలో చేసిన తొలి స్ట్రయిట్ సినిమా. పైగా.. పెన్ స్టూడియోస్కి అక్కడ మంచి గుర్తింపు ఉంది. అందుకే.. ఈ రేటు వచ్చింది. థియేట్రికల్ నుంచి వచ్చిందంతా ఇప్పుడు లాభమే. అందుకే.. సాయి శ్రీనివాస్‌తో మరో రెండు సినిమాలకు పెన్ స్టూడియోస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. వచ్చే యేడాది ఓ బాలీవుడ్ దర్శకుడ్ని బెల్లంకొండ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది.