హిందీ ఛత్రపతికి ఎట్టకేలకు మోక్షం దక్కింది. మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి టైటిల్ ఛత్రపతిగా ఫిక్స్ చేసింది. ఈ సినిమాకి ఆది నుంచీ.. కష్టాలే. బడ్జెట్ ఎక్కువైపోయిందని, రీషూట్లు చేశారని, టైటిల్ దొరకలేదని… రకరకాల అడ్డంకులు. ఎట్టకేలకు ఇప్పుడు ఫస్ట్ కాపీ చేతికి వచ్చింది.
ఛత్రపతి సినిమాని రీమేక్ చేయడమే.. పెద్ద సాహసం. అందులోనూ హిందీలో. ఎందుకంటే.. ఛత్రపతి డబ్బింగ్ రూపంలో హిందీకి వెళ్లింది. అక్కడ సోనీ మాక్స్‌లో ఈ సినిమాని తెగ చూసేశారు జనాలు. బాహుబలి హిట్టయ్యాక… సోనీలో ఈ సినిమా మరిన్నిసార్లు ప్రదర్శించారు. ప్రతీసారీ వ్యూవర్ షిప్ అదిరిపోతూ వస్తోంది. దానికి తోడు యూ ట్యూబ్‌లో హిందీ వెర్షన్ సిద్ధంగా ఉంది. అయినా సరే, రీమేక్ చేస్తున్నారు. కనీసం టైటిల్ అయినా మారిస్తే బాగుండేది. అదే టైటిల్ పెట్టారు. పైగా ఈ టైటిల్ కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు.ఎందుకంటే.. ఈ టైటిల్ ఇది వరకే ఓ నిర్మాత రిజిస్టర్ చేయించాడు. అతనితో బేరసారాలు ఆడి, రూ.2 కోట్లకు ఈ టైటిల్ కొనేశారు. ప్రీ లుక్ పోస్టర్లోనూ కొత్తదనం ఏమీ లేదు. ఛత్రపతిలోని ఓ ఐకానిక్ సీన్‌ని.. పోస్టర్ గా డిజైన్ చేశారు. మొత్తానికి అడుగడుగునా ఛత్రపతిని ఫాలో అయిపోయిన వినాయక్.. కథాపరంగా గొప్ప మార్పులు చేస్తాడని ఆశించలేం. కాపీ పేస్ట్ వ్యవహారం లానే ఉండొచ్చు. మరి.. ఇలాంటి సినిమాని బాలీవుడ్ జనాలు మళ్లీ ఆదరిస్తారా? బెల్లం కొండ కోసం టికెట్ కొని మరీ థియేటర్లకు వెళ్తారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.